Maneru River: కరీంనగర్ మానేరు రివర్ ( Maneru River ) ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై, సంబంధిత గుత్తేదారుపై, అలాగే గత పాలకుల పాత్రపై సమగ్ర విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) గురువారం కలిసి ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పేరుతో గత ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసిందన్నారు. అందులో పర్యాటక శాఖ రూ. 100 కోట్లు, నీటిపారుదల శాఖ రూ. 100 కోట్లు నిధులు విడుదల చేశాయని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఈ రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు చేపట్టారని, అయితే పనులను తమ అనుచరులకు అప్పగించి, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా గుత్తేదారు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. పనులు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారని, నిర్మాణంలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. రివర్ ఫ్రంట్ పరిధిలో నిర్మించిన చెక్ డ్యామ్‌లు వర్షాకాలంలో కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ డ్యామ్‌లు కొట్టుకుపోయిన తర్వాత కూడా రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులకు నిధులు విడుదల చేశారని ఆరోపించారు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై తక్షణమే విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎంను కోరారు.
Also Read: Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.