Balineni : అలగటం అనేది ముందు.. ఆ తర్వాత మాజీ మంత్రి, జనసేన సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) పుట్టారనే మాట పలు సందర్భాల్లో అక్షరాలా నిజమైంది..! ఒకవేళ ఇంకా గుర్తు రాలేదంటే వైసీపీలో (YSR Congress) ఉన్న రోజులు గుర్తు చేసుకుంటే చాలు టపీటపీమని గుర్తుకొచ్చేస్తాయ్ అంతే. అందుకే ఆ సంఘటనలతో బాలినేని పేరు కాస్త అలకనేనిగా మార్చేశారు నాటి వైసీపీ శ్రేణులు. ఎందుకంటే బాలినేనికి-అలకకు అంత అవినాభావ సంబంధం ఉంటుందన్న మాట. అందుకే ఈ రెండూ ఎప్పుడూ, ఏ పార్టీలో ఉన్నా నడుస్తూనే ఉంటాయి. ఆ మధ్య వైసీపీ వద్దు మహాప్రభో అని అల్లుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) వద్దనుకొని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఎర్ర కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. పోనీ ఇక్కడైనా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారా? అంటే అబ్బే అదీ లేదనే ఆరోపణలు మెండుగానే ఉన్నాయి.
Read Also- YS Jagan: చంద్రబాబు-జగన్ మధ్య ‘కమ్మ’ ఫైట్.. అభ్యంతరమేంటి?
సినిమా.. మళ్లీ మొదలైనట్టే!
వైసీపీని వీడి జనసేనలో చేరిన కొత్తలో అబ్బో.. ఆహా.. ఓహో.. ఔరా అనేలా కొద్దిరోజుల పాటు గట్టిగానే హడావుడి చేశారు. ముఖ్యంగా సెకీ ఒప్పందం (Seki Deal) వ్యవహారంలో ఈయన చేసిన కామెంట్స్ పెను సంచలనమే సృష్టించాయి. అంతేకాదు జగన్ గురించి మాట్లాడిన మాటలు కూడా అంతే రీతిలో సంచలనంగా మరాయి. దీంతో అల్లుడిపై ఒంటి కాలితో మామ లేస్తున్నారని అందరూ అనుకున్నారు. రేపో మాపో జగన్ బండారం మొత్తం బయటపెట్టేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా ప్రచారం, అంతకుమించి చర్చలు కూడా జరిగాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. త్వరలోనే ఎమ్మెల్సీ పదవి ఆ తర్వాత మంత్రి పదవి కూడా ఇవ్వొచ్చనే ప్రచారం సైతం జరిగింది. ఇదంతా మెగా బ్రదర్ నాగబాబును (Mega Brother Nagababu) ఎమ్మెల్సీ చేయకమునుపు మాటలు. సీన్ కట్ చేస్తే.. మంత్రి పదవి సంగతి దేవుడెరుగు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా లేదు. పోనీ.. ఏదో ఒక కార్పొరేషన్ పదవి అయినా వస్తుందేమో అని ఆశించిన బాలినేనికి నిరాశే మిగిలింది.
Read Also- Bayya Sunny Yadav: వైజాగ్‌లోని అన్వేష్ ఇంటికి భయ్యా సన్నీ యాదవ్.. టెన్షన్ టెన్షన్
ఈ దెబ్బతోనే డీలా!
వాస్తవానికి బాలినేని వైసీపీలో ఉన్నన్ని రోజులూ అటు టీడీపీ.. ఇటు జనసేన నేతలు, కార్యకర్తలను ఏ రేంజిలో ఆటాడుకున్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈయన్ను పొల్తెత్తు మాట మాట్లాడాలంటే చాలు భయపడేలా చేసుకున్నారని చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు.. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టిన పరిస్థితులూ ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రత్యర్థుల పార్టీ జనసేనలో చేరడంతో నాటికీ, నేటికీ అటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల, ఇటు రియాజ్ (జనసేన) ప్రత్యర్థులుగానే మిగిలిపోయారు. వారంతా ఈయనతో కలిసి కనీసం స్టేజీ పంచుకున్నది లేదు.. బాలినేని కూడా అంతే. సరిగ్గా ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఛైర్మన్‌గా రియాజ్‌కు ప్రమోషన్ వచ్చింది. దీంతో తనకు ఎమ్మెల్సీ, కనీసం కార్పొరేషన్ కూడా కేటాయించకపోగా రియాజ్‌కు నామినేటెడ్ పదవి కట్టబెట్టడంతో ఆయనదే పై చేయి అయ్యింది. రియాజ్ ఈ మధ్యనే సినిమా షురూ చేసినట్లుగా తెలిసింది. అందుకే బాలినేని డీలా పడ్డారట. ఎంతలా అంటే అసలు జనసేనలో కొనసాగడం అవసరమా? అన్నట్లుగా ఆలోచనలో పడినట్లుగా సమాచారం. అదేనండోయ్.. వైసీపీలో లాగే ఇక్కడ కూడా పదవులు లేకపోవడంతో అలకలు మొదలపెట్టారట మాజీ మంత్రి.
యూటర్న్ తీసుకుంటారా?
ఒక్క మాటలో చెప్పాలంటే అధికార పార్టీలో ఉన్నప్పటికీ బాలినేని పప్పులు ఉడకట్లేదట. ఆయన ఒక్కరే కాదు ఇతర పార్టీల నుంచి అటు జనసేన.. ఇటు టీడీపీ, బీజేపీలో చేరిన నేతల పరిస్థితీ అలాగే ఉందని తెలుస్తున్నది. ఈ క్రమంలో అనవసరంగా పార్టీ మారామా? అనే ఆలోచనలో బాలినేని వాసు పడ్డారట. వాస్తవానికి.. నాటి కాంగ్రెస్ హయాం నుంచి నిన్న, మొన్నటి వైసీపీలో ఉన్నన్ని రోజుల వరకూ బాలినేని అంటే ప్రకాశం జిల్లా.. ప్రకాశం అంటే బాలినేని అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. వైసీపీ వరకూ వైవీ సుబ్బారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బూచేపల్లి అయితే.. ఈ మధ్యనే జగన్ పొదిలి పర్యటనకు (Jagan Podili Tour) వెళ్లినప్పుడు ఆ జనసంద్రం, ఆ హడావుడి చూసిన తర్వాత అధికారంలో లేకుంటేనే ఈ రేంజిలో పరిస్థితులు ఉంటే.. ఒకవేళ అధికారంలో ఉంటే పరిస్థితేంటి? అని యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఆశించినంతగా పార్టీలో పరిస్థితులు లేకపోవడం, వైసీపీలోకి వెళ్తే మళ్లీ పాతరోజులు తిరిగొస్తాయని అభిమానులు, అనుచరులు బాలినేనికి సలహా ఇస్తున్నారట. బహుశా వాసు యూటర్న్ తీసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్ నడుస్తోంది. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు సరే.. ఇప్పుడు జగన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
Read Also- YS Jagan: వైఎస్ జగన్‌పై కుట్ర జరుగుతోందా?