Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. ఇటువంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని సిఎం అన్నారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. వారిని బాగా చదివించాని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని….ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి.. అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సిఎం హామీ ఇచ్చారు. ఘటన, తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Read Also- Samantha: సమంతకు చేదు అనుభవం.. వద్దన్నా, అలా వెంటపడుతున్నారేంటి?
అసలేం జరిగింది?
చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. కుప్పం మున్సిపాలిటీ (Kuppam Muncipality) పరిధిలోని నారాయణ పురం (Narayanapuram) లో ఈ దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదన్న కారణంగా మహిళను తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప (Timmarayappa), శిరీష (Sireesha) భార్య భర్తలు. గ్రామానికి చెందిన మునికృష్ణప్ప (Muni Krishnappa) దగ్గర భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుభారం పెరిగిపోవడంతో భార్య, బిడ్డలను వదిలేసి తిమ్మరాయప్ప ఊరు విడిచి వెళ్లిపోయాడు. దీంతో భార్య సైతం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పిల్లాడి స్టడీ సర్టిఫికేట్ కోసం శిరీష.. తిరిగి గ్రామానికి వచ్చింది. అయితే అప్పు తీర్చకుండా వెళ్లిపోయారని తీవ్ర ఆగ్రహంతో ఉన్న మునికృష్ణప్ప, అతని కుటుంబం.. శిరీషను చూడగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆమెపై దాడి చేయడమే కాకుండా తాడుతో చెట్టుకు కట్టేశారు. అప్పుతీర్చాలంటూ గంటపాటు వేధింపులకు గురిచేశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శిరీషను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మునికృష్ణప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also- YS Jagan: కుప్పం మహిళ ఘటనపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్..