BJP party: తెలంగాణలో గ్రౌండ్ లెవల్లో పార్టీని బలోపేతం చేసుకోవడంపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. భవిష్యత్తులో లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాక్టివిటీ పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 18 నుంచి 20 వరకు మూడ్రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ‘వికసిత్ సంకల్ప సభ’ పేరిట కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయింది. దీన్ని సక్సెస్ చేసేందుకు కమలం పార్టీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. వికసిత్ సంకల్ప సభలకు హాజరయ్యేందుకు ప్రతి సెగ్మెంట్ కు ఒకరు చొప్పున 119 అసెంబ్లీ స్థానాలకు 119 మంది గెస్టులను రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఈ జాబితాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నేతలు సైతం ఉన్నారు.
తెలంగాణలో వికసిత్ సంకల్ప సభ
తెలంగాణలో వికసిత్ సంకల్ప సభలను అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్యమైన మండలాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఈ సభల ద్వారా ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ఈ పదకొండేండ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను గ్రామీణ స్థాయిలో ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకుని చేపడుతున్నారు. ఇప్పటికే ఈ సభలను విజయవంతం చేసేందుకు పార్టీ ఇప్పటికే ముఖ్య నేతలతో రివ్యూ సైతం చేపట్టింది. 11 ఏండ్ల అభివృద్ధే ఎజెండాగా పెట్టుకుని పార్టీ ముందుకు వెళ్తోంది. 11 ఏండ్ల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఈనెల 18తో ముగియనుండగా వికసిత్ సంకల్ప సభల పేరిట మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా జీఎస్టీ మొదలు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వరకు భారత్ ఎదిగిన తీరు, దేశ భద్రత, మేకిన్ ఇండియా, స్టార్టప్ లు, జాతీయ విద్యా విధానం, ‘హీరా’తో రవాణా కనెక్టివిటీని పెంపొందించడం, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది.
Also Read: Air India Flight: మరో ఎయిర్ఇండియా విమానంలో సమస్య.. హడలిపోయిన ప్రయాణికులు!
11 ఏండ్ల పాలనపై అవగాహన
ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయిన కమలం పార్టీ ఇప్పటికే వరుసగా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈనెలలో అన్ని మండల, డివిజన్లలో పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. సోషల్ మీడియా రాష్ట్రస్థాయి వర్క్ షాప్ సైతం చేపట్టింది. 11 ఏండ్ల పాలనపై అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే ఈనెల 20న ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈనెల 25న ఎమర్జెన్సీ డేపై వర్క్ షాప్ సైతం నిర్వహించి కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని కమలదళం భావిస్తోంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన బీజేపీకి వికసిత్ సంకల్ప సభతో అయినా మైలేజ్ పెరుగుతుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: Medchal Ellampet Municipality: కొత్త మున్సిపాలిటీలకు పాత బోర్డులే.. పట్టించుకోని అధికారులు