Hyderabad Metro Phase 2: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న హైదరాబాద్ నార్త్ విభాగం ప్రజలకు సర్కారు తీపి కబురు విన్పించింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో భాగంగా ఫేజ్ -1, ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు ఇపుడు తాజాగా మెట్రోరైలు-2 బీ లో ప్రతిపాదించిన మూడు కారిడార్లకు ఆమోద ముద్ర వేసింది. మెట్రో రైలు-2బీలో 9వ కారిడార్ గా హైదరాబాద్ మెట్రో రైలు ప్రతిపాదించిన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సుమారు 39.6 కి.మీ.ల కారిడార్ తో పాటు సికిందరాబాద్ జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు సుమారు 24.5 కి.మీ.ల కారిడార్, అలాగే కారిడార్ 11గా పేర్కొన్న జీబీఎస్ నుంచి శామీర్ పేట వరకు సుమారు 22 కిలోమీటర్ల పొడువున ప్రతిపాదించిన మొత్తం 86.1 కిలోమీటర్ల సరి కొత్త మూడు మెట్రో కారిడార్లకు సర్కారు ఆమోదం తెలుపుతూ జీవోను జారీ చేసింది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 లో 69కి.మీ.ల పొడువున మూడు కారిడార్లకు పీపీపీ ప్రాతిపదికన ఆమోదం తెలిపి, రూ.22 వేల కోట్లతో అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 కింద మొత్తం 76.4 కిలోమీటర్ల పొడువున అయిదు కారిడార్లను రూ.24, 269 కోట్లతో ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సర్కారు తదుపరి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వ హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖకు పంపింది. ఆ తర్వాత ఫేజ్ -2బీగా పంపిన మూడు కారిడార్లకు సైతం సర్కారు తాజాగా ఆమోదం తెలిపింది.
వ్యయంలో ఎవరి వాటా ఎంత?
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2బీ కింద ప్రతిపాదించిన 86.1 కి.మీ.ల మూడు కారిడార్ల మెట్రో ఏర్పాటుకు సుమారు రూ. 19,579 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేయగా, వ్యయానికి సంబంధించి ఎవరి వాట ఎంత అన్న విషయంపై కూడా సర్కారు జీవోలో క్లారిటీ ఇచ్చింది. మొత్తం వ్యయంలో ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఖర్చుతో జాయింట్ వెంచర్ గా చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంత వాటాగా రూ. 5874 కోట్లు( 30శాతం), కేంద్ర ప్రభుత్వం తనవంతు వాటాగా రూ. 3524 కోట్లు(18శాతం) కేటాయించనున్నట్లు, మిగిలిన 48 శాతం రూ.9398 కోట్లను మెట్రోరైలు రుణంగా జైకా, ఏడీబీ, ఎన్ డీబీ లతో సమకూర్చుకోవాలని, నాలుగు శాతం రూ.783 కోట్లను పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ కింద నిధులను సమకూర్చుకోవాలని సర్కారు స్పష్టం చేసింది.
Also Read: Ex Minister Srinivas Goud: ఫార్ములా ఈ కార్ రేస్‌లో.. అవినీతి జరగలేదు!
స్థల సేకరణే ప్రధాన సమస్య
సికిందరాబాద్ జేబీఎస్ నుంచి శామీర్ పేట, మేడ్చల్, శంషాబాద్ ఏయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సర్కారు మెట్రో కారిడార్లను ఆమోదించినా, స్థల సేకరణే ప్రధాన సమస్యగా మారనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు విస్తరిస్తున్న పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన స్థల సేకరణలో స్థలాలిచ్చే యజమానులు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్)లకు ససేమిరా అనటంతో మెట్రోరైలు అధికారులు ఒక్క గజం స్థలానికి సుమారు రూ. 81 వేల నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నారు. కానీ జేబీఎస్ నుంచి శామీర్ పేట, మేడ్చల్ వరకు కొత్తగా 86.1 కిలోమీటర్ల ఏర్పాటు చేయనున్న మూడు కారిడార్లకు కావల్సిన స్థలాల్లో ఎక్కువ శాతం రక్షణ శాఖకు చెందిన స్థలాలే ఉన్నాయి.
వీటి స్థల సేకరణ చేయాలంటే సర్కారు రక్షణ శాఖకు మరో చోట ప్రత్యామ్నాయంగా అదే రేటు పలికే భూమిని కేటాయించాల్సి ఉంది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు స్థల సేకరణ కష్టతరమయ్యే ప్రాంతాల్లో సొరంగ మార్గం నుంచి మెట్రో కారిడార్ ను నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.
Also Read: Indus Water Treaty: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. సంచలన రిపోర్ట్ విడుదల