Ponguleti Srinivas Reddy: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 3వ తేదీ నుంచి హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటివరకు 561 మండలాల్లోని 7,578 గ్రామాల్లో సదస్సులు నిర్వహించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. ఈ సదస్సుల్లో మొత్తం 4.61 లక్షల దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. అందిన దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. “భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని భూ సమస్యలను పరిష్కరించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయాలి,” అని మంత్రి దిశానిర్దేశం చేశారు.
Also Read: Pagudakula Balaswamy: చిత్ర పరిశ్రమకు.. గద్దర్ కు సంబంధమేంటి?
పదేళ్ల గోస..
గత పదేళ్ల కాలంలో ధరణి చట్టం కారణంగా రైతులు తమ ప్రమేయం లేకుండానే భూ సమస్యల్లో చిక్కుకుపోయారని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం ధరణి కారణంగా ఉత్సవ విగ్రహాల్లా మారిపోయిందని, ప్రతిదానికి కోర్టు మెట్లు ఎక్కడం తప్ప రైతుకు మరో దారి లేకుండాపోయిందని అన్నారు. భూభారతి చట్టంలో భాగంగా రెండు నెలలుగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 50 ప్రాంతాల్లో తాను స్వయంగా పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
శరవేగంగా భూ సర్వే..
రాష్ట్రంలో తరతరాలుగా సర్వే చేయని లేదా సర్వే రికార్డులు లేని ఐదు నక్షా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన భూసర్వే శరవేగంగా సాగుతుందని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. గత ప్రభుత్వం నక్షా గ్రామాలను గాలికి వదిలేస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వే చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 413 నక్షా గ్రామాలకు గాను ఐదు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సర్వేను ప్రారంభించినట్లు తెలిపారు.
పైలట్ గ్రామాల సర్వే వివరాలు..
❄️మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ మండలం సలార్ నగర్: 422 ఎకరాలకు 337 ఎకరాల్లో సర్వే పూర్తి.
❄️జగిత్యాల జిల్లా, భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి గ్రామం: 626 ఎకరాలకు 269 ఎకరాలు పూర్తి.
❄️ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం ములుగుమడ: 845 ఎకరాలకు 445 ఎకరాలు పూర్తి.
❄️ములుగు జిల్లా, వెంకటాపురం మండలం నూగురు: 502 ఎకరాలకు 232 ఎకరాలు పూర్తి.
❄️సంగారెడ్డి జిల్లా, వట్ పల్లి మండలం షాహిద్ నగర్: 593 ఎకరాలకు 308 ఎకరాలు పూర్తి.
మొత్తం ఐదు గ్రామాల్లో 2,988 ఎకరాలకు గాను ఇప్పటివరకు 1,591 ఎకరాల్లో సర్వే పూర్తిచేసినట్లు మంత్రి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. మరో వారం, పది రోజుల్లో సర్వే ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చిన్న వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే క్షేత్రస్థాయిలో భౌతికంగా ఈ సర్వే జరుగుతోందని మంత్రి వివరించారు. ఈ నూతన విధానాల వల్ల భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందని, ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Israeli Iran War: తీవ్ర విషాదం.. దాడుల్లో 244 మంది మృత్యువాత.. ఇంత దారుణమా!