Harish Rao: రాజకీయాలకు తావు లేకుండా గోదావరి, బనకచర్లపై కృషి చేస్తే మీకు తోడుగా బీఆర్ఎస్ నిలబడుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్ట్‌తో గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్టు డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ) సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యానించారు.
ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించేలోపే, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా, ఏపీ యూనిలేటరల్‌గా ముందుకెళ్తుండడం అన్యాయమని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) జూన్ 13న కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసి ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. ఏపీ తీసుకుంటున్న చర్యలు 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతో పాటు నదీ జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించడమే అని అన్నారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఉత్తమ్ కోరాలని విజ్ఞప్తి చేయాలని సూచించారు.
Also Read:Government Aims: 540 నుంచి 5 వేలకు పైగా ప్రైమరీ స్కూళ్లకు విస్తరణ!
గోదావరి జలాల్లో 969 టీఎంసీల తెలంగాణ వాటాలో ఇప్పటివరకు వినియోగం 600 టీఎంసీలకు పెరిగిందన్నారు. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి బ్యారేజీలు, 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో గోదావరి బేసిన్ అభివృద్ధి, చెరువులు, చెక్ డ్యాంలు, మిషన్ కాకతీయ, కాల్వల ద్వారా గోదావరి నీటిని వ్యవస్థీకృతంగా వినియోగంలోకి తేవడం జరిగిందని వివరించారు. తెలంగాణ(Telangana) ప్రాజెక్టులైన కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్క సాగర్, వార్ధా (బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు)ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు.
ఐఎస్ఆర్ డబ్ల్యూడీ చట్టంలోని సెక్షన్ 3 కింద తెలంగాణ హక్కులపై విచారణ చేపట్టేందుకు ట్రైబ్యునల్ పరిధిని టీఓఆర్‌కు విస్తరించించాలని కేంద్రాన్ని ఒప్పించడంలో కేసీఆర్( KCR) విజయం సాధించారన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేసి, పదేళ్ల పాటు కేంద్రంతో పోరాడి ట్రైబ్యునల్ పరిధిని విస్తరించడంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం సాధించిన విజయం రాష్ట్రానికి కీలక మైలురాయని గుర్తు చేశారు. ఈ పోరాట ఫలితంగా ఇప్పుడు 45 టీఎంసీలతో పాటు 112.5 టీఎంసీల అదనపు వాటా కోసం ట్రైబ్యునల్ ముందు వాదించే అవకాశం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ (BRS) మీకు తోడుగా నిలుస్తుందని హరీశ్ రావు (Harish Rao) లేఖలో పేర్కొన్నారు.
Also Read: Local Elections: స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం!