RTO Vacancies: రావాణాశాఖకు ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని ఏళ్ల తరబడి ఖాళీలు ఉండగా కొన్ని గతేడాది డిసెంబర్‌లో కొంతమంది ఆర్టీఓలకు ప్రమోషన్లు ఇవ్వడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. కానీ వాటిని భర్తీ చేసేందుకు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేసేందుకు చొరవ తీసుకోవడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 12 ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీల్లో ఎంవీఐలకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇన్ చార్జీ పాలనలలోనే రవాణాశాఖ కార్యాలయాలు నడుస్తున్నాయి. పనిచేసే ఉద్యోగులపై అదనపుభారం పడుతుంది.
ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర వ్యాప్తంగా 62 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఉద్యోగుల పనితీరు, కార్యాలయాలకు అవసరమైన కొత్త భవనాలు, మౌళిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల వినియోగం తదితర అవసరాలు పై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గతేడాది నవంబర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి వివరాలను సైతం అందజేసినట్లు సమాచారం. కార్యాలయాల్లో ఖాళీల వివరాలను సైతం అందజేశారు. కానీ వాటి భర్తీ విషయంలో మాత్రం ఆలస్యమవుతుంది. ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమా? లేకుంటే మంత్రి చొరవ చూపకపోవడమా? అనేది చర్చనీయాంశమైంది. రవాణాశాఖలను ప్రక్షాళన చేయాల్సి ఉన్నప్పటికీ కొంత జాప్యం జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది.
ప్రమోషన్లు కల్పించడంలో నిర్లక్ష్యం
ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రమోషన్లు కల్పించడం లో నిర్లక్ష్యం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన అక్కడ ఆర్టీఓ పోస్టులు మంజూరీ ఇవ్వలేదు. ఎంవీఐలతోనే కాలం వెల్లదీస్తుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో అర్హులైన ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని పలువురు బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా చొరవ తీసుకుంటుందని ఉద్యోగులు ఆశించినప్పటికీ నిరాశే ఎదురవుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేశాఖలలో స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ ఒక్కటి. అంతేకాదు రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ అథారిటీ ఉద్యోగులే కీలకం.
Also Read: Solar Power Plants: రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు.. ప్రతి జిల్లాకు రెండు
12 ఆర్టీఓలు వెకెన్సీ
గతేడాది నవంబర్ లో రవాణా శాఖలో డీటీసీలుగా పనిచేస్తున్న వారికి జేటీసీలుగా, ఆర్టీఓలుగా పనిచేస్తున్న వారికి డీటీసీలుగా పదోన్నతులు అవకాశం కల్పించింది. ఆర్టీఓలను డీటీసీలుగా పదోన్నతులు కల్పించడంతో 5 ఆర్టీఓ పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. అంతకు ముందు మరో 7 ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 12 ఆర్టీఓ పోస్టులు ఖాళీ అయ్యాయి. హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ వెస్ట్, నాగోల్, గద్వాల, ఉప్పల్, మంచిర్యాల, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, సిద్దిపేట ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే అర్హులైన ఎంవీఐలు ఉన్నారు. గత పదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. కానీ వారికి ప్రమోషన్లు కల్పించకపోగా, ఇన్ చార్జులతోనే ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుంది. కమిషనర్ సైతం చొరవ తీసుకోవడం లేదనే ప్రచారం జరుగుతుంది. అర్హులైన ఉద్యోగులు నిరాశనిస్పృహలకు గురవుతున్నారు.
కొత్తజిల్లాలకు నోఆర్టీఓ శాంక్షన్
ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీఓ పోస్టుకు గత ప్రభుత్వం మంజూరీ ఇవ్వలేదు. కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి కి సైతం ఆర్టీఓశాంక్షన్ ఇవ్వలేదు. భూపాలపల్లి కొత్త జిల్లాకు ఆర్టీఓ శాంక్షన్ ఇవ్వలేదు. అదే విధంగా జగిత్యాల, జనగాం, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్లా, వనపర్తి, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, ములుగు, నారాయణపేట జిల్లాలకు గత ప్రభుత్వం ఆర్టీఓ పోస్టులు మంజూరీ చేయలేదు. కేవలం జిల్లాలు మాత్రం చేసి అక్కడ ఇన్ చార్జులుగా ఎంవీఐలకు బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాల్లో డీటీసీ పోస్టులు ఉన్న దగ్గర ఆర్టీఓ పోస్టులకు శాంక్షన్ ఇవ్వలేదు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ కు సైతం ఆర్టీఓపోస్టుకు మంజూరీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం సైతం చొరవ తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమోషన్లపై కమిటీ ఉన్నా చొరవ నిల్ ?
ఏ శాఖలో లేని విధంగా స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ(ఎస్టీఏ)లో ఉద్యోగుల ప్రమోషన్లకు ఉన్నతాధికారులతో కూడిన కమిటి ఉంటుంది. ఆ కమిటీ దగ్గర ఉద్యోగుల పనితీరుతో పాటు పూర్తి వివరాలు ఉంటాయి. ప్రమోషన్ల కల్పనలో ఆకమిటీ తీసుకున్న నిర్ణయంను ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది. ఎవరిపైనాసదాభిప్రాయం లేకుంటే వారికి ప్రమోషన్ల కల్పనను పెండింగ్ లో పెట్టడంతో పూర్తి వివరాలను తెలియజేస్తుంది. ఇంత పకడ్బందీగా వ్యవహరించే ఈ కమిటీ సుమారు నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ఎందుకు చొరవచూపడం లేదని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఖాళీలతో కింది స్థాయి ఉద్యోగులపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఇన్ చార్జులతో కాలం వెళ్లదీస్తున్నప్పటికీ స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తుంది.
Also Read: MP Dharmapuri Arvind: ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్.. ఢిల్లీలో ఎంపీ గరం గరం