Sambasiva Rao on Kaleshwaram: బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao).. ఈ ప్రాజెక్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఎందుకు పనికిరాదని.. ఆ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల డబ్బును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు ఇప్పుడు నోర్లు మూసుకున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నీ నేనే అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ (KCR).. కమిషన్ విచారణలో తనకేం సంబంధం లేదని వ్యాఖ్యానించారని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. తుమ్మిడిహట్టి (Tummidihetti Barrage)కి మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదని హరీశ్ రావు (Harish Rao) అంటున్నారని.. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని తాము డిమాండ్ చేశామని పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మించాక పంటలకు ఒక్క చుక్కనీరు అదనంగా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికీ పంటలకు వస్తోంది ఎల్లంపల్లి నీళ్లేనని పేర్కొన్నారు.
Also Read: Ahmedabad Flight Crash: విమాన ప్రమాదం.. తెరపైకి మరో విషాద గాధ.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagar) పై కూడా సీపీఐ నేత మాట్లాడారు. కేంద్రం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందన్న ఆయన.. కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ వచ్చాక.. అలీన విధానాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. అమెరికా చెప్పుచేతల్లో నరేంద్ర మోదీ పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో మోదీ.. ఇజ్రాయిల్ కు సపోర్ట్ ఇస్తున్నారని.. భారతదేశ విదేశాంగ విధానం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.