Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మరోసారి ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును శుక్రవారం విచారించారు. హార్డ్ డిస్కుల ధ్వంసంతోపాటు ఎవరి ఆదేశాల మేరకు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న దానిపై సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రెండుసార్లు విచారించినా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి కీలక వివరాలు వెల్లడించని విషయం తెలిసిందే. హార్డ్ డిస్కుల విధ్వంసంతో తనకేలాంటి సంబంధం లేదని ఆయన దర్యాప్తు అధికారులతో చెప్పారు. వాటిని ధ్వంసం చేయాలని తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. దాంతో సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ప్రణీత్ రావును విచారించారు. ఎవరు చెబితే హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారని ప్రశ్నించినట్టు తెలిసింది.
ఆ వివరాలపై ప్రశ్నలు
అయితే సిట్ ప్రశ్నలకు గతంలో చెప్పినట్టుగానే ప్రభాకర్ రావు సూచనల మేరకే ఆ పని చేశానని ప్రణీత్ రావు చెప్పినట్టు సమాచారం. ఇక, ఏయే నెంబర్లను ట్యాప్ చేయాలన్న సూచనలు కూడా ప్రభాకర్ రావు నుంచే అందేవని వెల్లడించినట్టు తెలిసింది. ఈ వివరాలు అన్నింటినీ రికార్డు చేసిన సిట్ అధికారులు నేడు విచారణకు రానున్న ప్రభాకర్ రావు ముందు వీటిని పెట్టి మరోసారి నిశితంగా ప్రశ్నించనున్నారు.
Also Read: Israel Iran War: అర్ధరాత్రి భీకర యుద్ధం.. దూసుకొచ్చిన 100 మిసైళ్లు.. పరుగులు పెట్టిన జనం
సుప్రీంకోర్టు దృష్టికి?
ఈసారి కూడా ప్రభాకర్ రావు నోరు తెరవక పోతే మొత్తం విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా సుప్రీం కోర్టు ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణ తొలగిపోయేలా చేసి, ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి విచారణ జరపాలని సిట్ అధికారుల వ్యూహంగా కనిపిస్తున్నది. అప్పుడే ప్రభాకర్ రావు పెదవి విప్పే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఒక్కసారి ప్రభాకర్ రావు నోరు తెరిస్తే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌లో సూత్రధారులు ఎవరన్నది బయట పడుతుందని భావిస్తున్నారు.