Kodandareddy: తెలంగాణలో సెరికల్చర్ విభాగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, దాని అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్కే భవన్‌లోని రైతు కమిషన్ చైర్మన్‌తో సెరికల్చర్ డిపార్ట్‌మెంట్ అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెరికల్చర్ అధికారులు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఈ విభాగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. నియామకాలు చేపట్టకపోవడం, నిధులు కేటాయించకపోవడంతో సెరికల్చర్ విభాగం నిర్వీర్యమైందని వివరించారు.
Also Read: HYDRA Commissioner: వరద ముంపు ప్రాంతాల్లో.. హైడ్రా కమిషనర్ పర్యటన!
సిల్క్ బోర్డు ద్వారా నిధులు
గత ప్రభుత్వం సెరికల్చర్‌ను హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో కలపడం వల్ల దాని మనుగడకే ప్రమాదంగా మారిందని ఆవేదన చెందారు. జిల్లా స్థాయిలో కూడా అధికారుల కొరత తీవ్రంగా ఉందని, రాష్ట్రంలో పట్టుపురుగుల సాగులో మంచి లాభాలున్నా పట్టించుకోలేదని తెలిపారు. పట్టుపురుగుల సాగుతో రైతులు లాభపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, సెంట్రల్ సిల్క్ బోర్డు ద్వారా నిధులు కూడా పొందవచ్చని, తెలంగాణలో సిల్క్ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని వివరించారు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
అధికారుల విజ్ఞప్తికి స్పందించిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సెరికల్చర్ డిపార్ట్‌మెంట్ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుల దృష్టికి తీసుకెళ్తానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ రాయితీలు ప్రజలకు అందేలా కృషిచేయాలని సూచించారు.
Also Read: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక సోనమ్ ఫ్యామిలీ హస్తం!