Coronavirus Cases India: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. రోజు రోజుకు యాక్టివ్ కేసులు సంఖ్య పెరుగుతూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7154 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. ఇందులో మూడు మరణాలు కేరళలో నమోదు కాగా.. కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు మరణించినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 8,573 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
రాష్ట్రాల వారీగా కేసులు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల విషయానికి వస్తే కేరళ టాప్ లో ఉంది. దేశంలోని అత్యధికంగా 2165 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. గుజరాత్ లో 1281, మహారాష్ట్రలో 615, కర్ణాటకలో 467 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 731 యాక్టివ్ కేసులు ఉండగా రోజు రోజుకు ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ప్రస్తుతం 103 కరోనా కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 31 మంది వైరస్ బారిన పడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం 12 కోవిడ్ కేసులు ఉండగా.. బుధవారం ఒక కేసు నమోదైంది.
కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో కరోనా కేసులు క్రమం తప్పకుండా పెరుగుతుండటతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీని కలిసే మంత్రులు, అధికారుల కోసం కొత్త టెస్టింగ్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై మోదీని కలవాలంటే RT-PCR టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. ఆ రిపోర్ట్ లో కరోనా లేదని తేలితేనే మోదీ అపాయింట్ మెంట్ లభిస్తుందని స్పష్టం చేసింది.
Also Read: Actress Kalpika: సినీ నటి కల్పికకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు, అలసట, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సైతం స్వీయ నియంత్రణ పాటించాల్సిన బాధ్యత ఉందని సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను తరుచూ శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలని హితవు పలుకుతున్నారు.