KCR: కాళేశ్వరం ప్రాజెక్టులో టెక్నికల్ అంశాలన్నీ వందకు వందశాతం ఇంజినీర్లే నిర్ణయాలు తీసుకున్నారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ కు వెల్లడించారు. కాళేశ్వరం నిర్మాణంపై మేమే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. బీఆర్కే భవన్ లో బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. బ్యారేజీల లొకేషన్ల మార్పు నిర్ణయం ఎవరు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా, బ్యారేజీల లొకేషన్ల మార్పు కూడా సాంకేతికాంశమని, అది కూడా ఇంజినీర్లే చూసుకున్నారని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. టెక్నికల్ అంశాలుంటాయని, ఆ నివేదికలు, వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా బ్యారేజీల స్థలాలు మార్చారని కేసీఆర్ వివరించారు.
4వేల మంది ఇంజినీర్లు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్నది ఎవరి నిర్ణయమని కమిషన్ ప్రశ్నించగా, అది తాము తీసుకున్న నిర్ణయమేనని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4వేల మంది ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు పనిచేశారని సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నింపాలంటూ తాను చెప్పలేదని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ముందు పేర్కొన్నట్లు సమాచారం. అది పూర్తిగా సాంకేతికపరమైన అంశమని, ఇంజినీర్లు చూసుకుంటారని తెలిపారు. బ్యారేజీల్లో ఏ లెవెల్లో ఎన్ని నీళ్లుంటాయి.. ఎంత స్టోర్ చేయాలి.. ఎన్ని ఎత్తిపోయాలనేది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ వివరించినట్టు తెలిసింది.
Also Read: Revanth Reddy: కేసీఆర్ ను కాంగ్రెస్ లోకి రానీవ్వను.. సీఎం సంచలన వాఖ్యలు!
కేసీఆర్ సమాధానం
రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా నిధులు ఎలా సమకూర్చారు? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించగా, నీళ్లు.. నిధులు.. నియామకాల నినాదంతో ఏర్పడిన కొత్త రాష్ట్రం తెలంగాణలో నీళ్ల కోసం కొత్త ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, వాటికి నిధుల కొరత ఉండడంతో రుణ సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆదాయం సమకూరేదాకా.. రుణాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకున్నదని కేసీఆర్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. రుణాలు ఇచ్చిన సంస్థలు ప్రభుత్వ పూచీకత్తు అడగడంతో ఆ రుణాలకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని పేర్కొన్నారు.
సర్వే చేశాం
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని, ప్రాజెక్టు కోసం 11 క్లియరెన్సులను తీసుకున్నామని కేసీఆర్ కమిషన్ కు వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చెప్పిందని తెలిపారు. దీంతో వ్యాప్కోస్, సీడబ్ల్యూసీ సూచనల మేరకే నీటి లభ్యతను బట్టి మేడిగడ్డకు మార్చామని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. బ్యారేజీని మార్చడానికి ముందు మూడు బ్యారేజీల స్థలాల్లో హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే చేశామని, అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రధానికి తాను లేఖ రాశానని కేసీఆర్ వివరించారు.
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదని, పలుమార్లు విజ్ఞప్తులు చేసినా 148 మీటర్లకే ఒప్పుకుంటామని స్పష్టం చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్రవైపు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఉండడంతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ముందుకు సాగలేదని కమిషన్ కు డాక్యుమెంట్లతో వివరించారు.
Also Read: Dil Raju: పెయిడ్ వ్యూస్.. నా పీఆర్ టీమ్‌కు ఆ సూచన చేశా!
రూ.280 కోట్లకేటాయించింది
తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఓపెన్ కెనాల్ నిర్మాణానికి సంబంధించి అక్కడ బొగ్గు బ్లాకులు ఉండడంతో సాధ్యపడదని చెప్పడంతో సీడబ్ల్యూసీ సర్వేల మేరకు మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు తేలిందని, ఆ నీటి నుంచి 230 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించి మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. బ్యారేజీల నిర్మాణం తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ను పక్కాగా చేశామని, అందుకు రూ.280 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, బ్యారేజీ వద్ద ఈఈ స్థాయి అధికారిని నియమించామని కమిషన్ కు కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.
నిజమేనని కమిషన్ కు కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా? అని కమిషన్ ప్రశ్నించగా, ప్రాజెక్టులోని ప్రతి దానికి కేబినెట్ ఆమోదం ఉందని కేసీఆర్ వివరించారు. కేబినెట్లో చర్చించి ఆమోదం తీసుకున్నామని వివరించారు. 2017 డిసెంబర్ 9న ప్రాజెక్ట్‌పై రివ్యూ మీటింగ్ జరిగింది కదా..? ఆ మీటింగ్ మినిట్స్ ఉన్నాయా..? వాటిలో ఉన్న అంశాలన్నీ నిజమేనా? అని కమిషన్ ప్రశ్నించగా, మీటింగ్ మినిట్స్‌లో అన్ని అంశాలున్నాయని, అందులో పేర్కొన్నవన్నీ నిజమేనని కమిషన్ కు కేసీఆర్ తెలిపారు.
బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ అంశాలన్నింటినీ సంబంధిత శాఖ, ఆ శాఖ అధికారులే చూసుకున్నారని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. జీవో45, 2020 తో కూడిన ఆపరేషన్ మెయింటనెన్స్ పై డాక్యుమెంట్స్ సైతం కేసీఆర్ కమిషన్ కు అందజేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఓ బుక్ లెట్ కమిషన్ కు అందజేసినట్లు సమాచారం. అంతేగాకుండా ప్రాజెక్టుపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు సంబంధించిన పీపీటీని కమిషన్ కు ఇచ్చినట్లు తెలిసింది.
Also Read: Harish Rao On CM Revanth: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన కామెంట్స్