CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ లో చేరతారన్న ఊహాగానాలపై స్పందిస్తూ తాను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు ప్రధాన శత్రువులు.. కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) అని మండిపడ్డారు. కవిత కొత్త పార్టీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చని.. కాంగ్రెస్ లో మాత్రం చేరదని సీఎం స్పష్టం చేశారు. మంత్రుల మార్పు జరుగుతుందన్న ప్రచారాన్ని కూడా సీఎం కొట్టిపారేశారు. తన వద్ద ఉన్న శాఖలే కొత్త మంత్రులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు ఆ గ్రూప్ తోనే కమిషన్ విచారణకు వెళ్లారని విమర్శించారు. దెయ్యాల్లో ఆమె కూడా భాగం అయ్యిందా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. వారంతా ఒక్కటేనన్న రేవంత్.. వారినెవరూ పట్టించుకోకపోవడంతో కొత్త చర్చకు తెర లేపారని ఆరోపించారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కమిషన్ ఎదుట తన అభిప్రాయాలను కేసీఆర్ చెప్పారని అన్నారు. ఎల్లుండి కాళేశ్వరంపై తన అభిప్రాయాలు ఏంటో చెప్తానని తెలియజేశారు.
Also Read: KTR on CM Revanth Reddy: కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు.. సీఎంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
మరోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ నేత కిషన్ రెడ్డి (Kishan Reddy) పైనా సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాలేకపోయారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ కుల గణన సర్వే మోడల్ ను కర్ణాటక సీఎం (Karnataka CM), డిప్యూటీ సీఎంలకు వివరించేందుకే తాను ఢిల్లీకి వచ్చినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారితో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, మల్లీఖార్జున్ ఖర్గే పాల్గొన్నట్లు చెప్పారు.