ACB Raids: తెలంగాణలో భారీ అవినీతికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సేవలు అందించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
Also Read: KCR Kaleshwaram: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఏం చెబుతారో?
నూనె శ్రీధర్ విషయానికి వస్తే ఆయన గతంలో అత్యంత ప్రాధాన్యమున్న ప్రాజెక్టుల్లో పని చేశారు. ఈ క్రమంలో ఆయన అక్రమంగా వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లాయి. ప్రస్తుతం ఆయన చొప్పదండిలోని SRSP క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. నూనె శ్రీధర్ నివాసాలు, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఎలాంటి ఆస్తులను గుర్తించారో అధికారులు ప్రకటించాల్సి ఉంది.