KCR Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంతు వచ్చింది. విచారణకు హాజరుకావాలని గత నెల 20న కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. తొలుత ఈ నెల 5న విచారణకు రావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అయితే, కేసీఆర్ మాత్రం గడువు కోరడంతో పాటు ఈ నెల 11న వస్తానని అందుకు అనుమతి ఇవ్వాలని కమిషన్‌ను కోరారు. దీనికి కమిషన్ అంగీకరించడంతో బుధవారం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 9గంటలకు ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి బయలుదేరి 11:30 గంటల వరకు బీఆర్కే భవన్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కమిషన్‌కు ఆధారాలు అందజేత!
ఇదిలా ఉంటే కేసీఆర్ ను ఓపెన్ కోర్టులో కమిషన్ విచారణ చేయనుంది. విచారణ సందర్భంగా కమిషన్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన జీవోలు, డాక్యుమెంట్లు, సబ్ కమిటీ నివేదిక, క్యాబినెట్ తీర్మాణాలు, తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మార్పు, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకోకపోవడం, ఆ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు, సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక, వాప్కోస్ సంస్థ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన సూచనలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు గల కారణాలు, కాళేశ్వరం ఘనత, ఆ ప్రాజెక్టుతో రాష్ట్ర రైతాంగానికి కలిగిన ప్రయోజనాలు ప్రతులను కమిషన్‌కు అందజేయనున్నట్లు సమాచారం.
కేసీఆర్‌తో హరీశ్ భేటీ
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో వరుసగా రెండో రోజూ మంగళవారం కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరానికి ప్రాజెక్టు మార్పు రీ డిజైనింగ్, ఆర్థిక అనుమతులు, పర్యావరణ, సీడబ్ల్యూసీతో పాటు ఇతర అనుమతులు తీసుకున్న వివరాలపైనా చర్చించారు. హరీశ్ రావుకు ప్రాజెక్టు మొదలు నుంచి కంప్లీట్ వరకు పూర్తి అవగాహన ఉంది. తొలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేయడం, రెండోసారి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ కేసీఆర్ దగ్గర ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ఇటు ప్రజలకు, అటు అసెంబ్లీలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను వివరించారు.
Also Read: Ram Charan: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ .. ఆ స్టార్ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త సినిమా..
ఆ కారణం చేతనే
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అన్ని అంశాలు, బ్యారేజీలకు సంబంధించిన వాటికి సంబంధించిన అంశాలపైనా హరీశ్ రావుకు అవగాహన ఉంది. దీంతో అందుకు సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు ఆయన వివరించారు. కొన్ని అంశాలను రిటైర్డ్ ఇంజినీర్లతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. కమిషన్ ముందు ప్రతి అంశాన్ని వివరించడంతో పాటు కమిషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పేలా ప్రిపేర్ అయ్యారు. కేసీఆర్ కమిషన్‌కు ఏం చెబుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.