Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఏమీ లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. గ్రామస్థాయిలో అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి నిరుపేదలను ఎంపిక చేసి జాబితాలను తయారు చేస్తే ఇందిరమ్మ కమిటీలతో ఆ జాబితాలే తారుమారవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్న తమని ప్రసన్నం చేసుకున్న వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
మరి కొన్నిచోట్ల నాయకులు మధ్య ఉన్న వర్గ విభేదాలతో పేదవారు మధ్యలో బలైపోతున్న ఘటనలు సైతం ఉన్నాయి. ఇళ్ల మంజూరు విషయంలో అధికారులు కూడా ప్రేక్షకులుగానే మిగిలిపోతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రావిగూడెం గ్రామంలో ఇల్లు మంజూరు విషయంలో తమకు తీవ్ర అన్యాయం చేశారని, మొదటి జాబితాలో ఉన్న తమ పేర్లను తొలగించి వేరే వారికి కేటాయించారని బాధితులు వాపోతున్నారు.
Also Read: Mahesh Kumar Goud: మోదీ పదవుల కోసం పుట్టిన మనిషి.. ఇందిరమ్మతో పోలికేంటి?
తమకు ఇల్లు ఎందుకు మంజూరు కాలేదని అడిగితే వేరే జాబితాలో ఇల్లు వస్తుందని చెప్పి తప్పించుకుంటున్నారని లబ్ధిదారుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. గ్రామంలో అధికారులు సర్వే నిర్వహించి దాదాపు 90 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో వారందరి పేర్లు చదివి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల ప్రభుత్వం నేలకొండపల్లి గ్రామానికి 29 ఇళ్లను మంజూరు చేసింది. అధికారులు తయారుచేసిన జాబితా కాదని ఇందిరమ్మ కమిటీ ద్వారా 29 మందిని ఎంపిక చేసి అధికారులకు జాబితాను పంపించారు. దాంతో నిరుపేదలైన కొందరు తమ పేర్లు వస్తాయి అనుకుంటే వారికి రాకపోవడంతో వారు ఎంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు గ్రామసభలో ఇల్లు వస్తాయని పేర్లు చదివి ఇప్పుడు ఇల్లు మంజూరు కాలేదని చెప్పడంతో వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు.
ఈ వృద్ధురాలి పేరు రామనబోయిన కోటమ్మ
ఈమెకు కొడుకు కోడలు ఉన్నారు. ఈమె 20 ఏళ్లుగా రేకుల నివాసంలో జీవిస్తుంది. కోటమ్మకు ఎటువంటి భూమి కూడా లేదు. అధికారులు సర్వే చేసినప్పుడు జాబితాలో మొదటి పేరు ఈమదే ఉండడం విశేషం. గ్రామ సభలో ఈమెకు ఇల్లు కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కానీ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఈమె పేరు లేకపోవడం విశేషం.
ఈమె పేరు బోయిన త్రివేణి
తనకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భర్త కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరు 9 ఏళ్లుగా గ్రామంలో అద్దె భవనంలో నివసిస్తున్నారు. వీరికి గ్రామంలో సొంతంగా ఇంటి స్థలం ఉండడంతో అధికారులు వచ్చి ఫోటో కూడా తీసుకున్నారు. వీరికి వ్యవసాయ భూమి కూడా లేదు. అయినా కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితాలో పేరు రాకపోవడంతో వారు ఎంతో ఆవేదనకు గురయ్యారు.
Also Read: 11 Years of Modi Govt: తెలంగాణకు కేంద్ర మంత్రి.. రాష్ట్రాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు!