11 Years of Modi Govt: కేంద్రంలోని బీజేపీ.. వికసిత భారత సంకల్ప్ అభియాన్ పేరుతో దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ 11 ఏళ్ల బీజేపీ పాలనలో సాధించిన విజయాలు, తీసుకొచ్చిన సంక్షేమాల గురించి పార్టీ శ్రేణులు, ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. తెలంగాణకు వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనపై ’11 సాల్’ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
కేంద్రంలో తమ 11 ఏళ్ల పాలనలో చోటుచేసుకున్న అభివృద్ధి గురించి చెప్పేందుకు ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు కేంద్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పారు. 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని.. నివాసం లేని వారికి 6 కోట్ల ఇళ్లను నిర్మించామని చెప్పారు.
మావోయిస్టుల ఏరివేతపై
తెలంగాణలో కొత్తగా రైల్వే లైన్లు, రోడ్ల నిర్మాణం, కొత్త ఎయిర్ పోర్ట్ ను అనౌన్స్ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రం నుంచి రూపాయి ఇస్తే.. 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు అందేవని పేర్కొన్నారు. తాము పారదర్శమైన పరిపాలనను అందిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. తమ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తద్వారా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో శాంతి నెలకొల్పినట్లు స్పష్టం చేశారు. కేంద్రం తరపున తెలంగాణకు ఉచితంగా బియ్యం కూడా అందిస్తున్నట్లు వివరించారు.
Also Read: MLC Kavitha: తెలంగాణలో సంచలనం.. పోలీసుల అదుపులో కవిత.. ఎందుకంటే?
ఆ భయాలు వద్దు!
తెలంగాణకు సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయంతో పాటు అనేక కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూళ్లను కేంద్రం మంజూరు చేసిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 21వ శతాబ్దంలో ఇండియా గేమ్ ఛేంజర్ గా మారబోతోందని కొనియాడారు. 2013-14 తో పోలిస్తే 11 ఏళ్లలో దేశ వ్యవసాయ బడ్జెట్ 11 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. మరోవైపు తెలంగాణకు ఐఐఎం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మరోవైపు దక్షిణ భారత దేశంలో పార్లమెంటు సీట్లు తగ్గుతాయన్న ఆందోళనలను విడనాడలని ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు.