Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A1 గా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao).. సిట్ (Special Investigation Team) విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ ఆఫీసులో సిట్ బృందం ఆయన్ను విచారించనుంది. ప్రభాకర్ రావు విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంపై, అలాగే ఎంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ ఆయనను విచారించనుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటి? అందులో ప్రభాకర్ రావు ప్రమేయం ఏంటీ? అతడి వెనక ఎవరెవరు ఉన్నారు? వంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది?
సిట్ విచారణకు హాజరైన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (Special Operations Team)ను ఏర్పాటు చేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు (D. Praneeth Rao), ఏఎస్పీ మేకల తిరుపతన్న (Mekala Thirupathanna), ఎన్. భుజంగరావు (N. Bhujanga Rao), రాధా కిషన్ రావు (Radha Kishan Rao) లను కలిపి ఒక టీమ్ గా ఫామ్ చేశారు. అయితే మావోయిస్టులపై నిఘా కోసం ఉపయోగించే సాధనాలను ఈ SOT టీమ్.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.
సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్!
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) విజయమే లక్ష్యంగా ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (Special Operations Team) టీమ్ పని చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకున్న అధునాతన సర్వైలెన్స్ సాధనాలను అప్పటి విపక్ష నాయకులు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నాయకుల ఫోన్ ను అక్రమంగా వారు ట్యాపింగ్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ఎన్నికల్లో విపక్ష పార్టీలకు మద్దతిచ్చే వ్యక్తుల ఫోన్లను సైతం SOT ట్యాప్ చేసినట్లు సిట్ తన ఎఫ్ఆర్ఐలో పేర్కొంది.
ఫోన్ ట్యాపింగ్ డేటాతో బెదిరింపులు
ఫోన్ టాపింగ్ ద్వారా సేకరించిన డేటాను ఎస్ఓటీలో భాగమైన డీఎస్పీ ప్రణీత్ రావు.. అక్రమంగా ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారవేత్తల వ్యక్తిగత విషయాలను అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బు దోచుకున్నట్లు వార్తలు వచ్చాయి. కొందరు వ్యాపారులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు కూడా సేకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఏకంగా 36మంది వ్యాపారవేత్తలను ప్రణీత్ రావు బెదిరించి డబ్బు తీసుకున్నట్లు సిట్ బృందం గుర్తించినట్లు సమాచారం. అంతేకాదు ఎస్ఓటీ బృందాన్ని దాటి కూడా ఫోన్ ట్యాపింగ్ సమాచారం కిందస్థాయి సిబ్బందికి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. నల్గొండలో ఒక కానిస్టేబుల్.. 40మంది మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
సాక్ష్యాల ధ్వంసం
2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2024 మార్చి 10న ఎస్ఐబీలోని అదనపు ఎస్‌పీ డి. రమేష్ ఫిర్యాదు నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. దీనిపై పంజా గుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే డీఎస్పీ ప్రణీత్ రావు.. ప్రభాకర్ ఆదేశాల మేరకు పెద్ద మెుత్తంలో సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఎస్‌ఐబీ కార్యాలయంలోని 45కి పైగా హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉందని పోలీసులు ఆరోపించారు.
Also Read: Jr NTR: ఆ ఇద్దరి కూతుళ్ళకు ఎన్టీఆరే పెళ్లి చేశాడని చెప్పిన నటుడు అశోక్ కుమార్
వరుస అరెస్టులు
ఫోన్ ట్యాపింగ్ కేసు పరిధి చాలా విసృతంగా ఉన్న నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతను సిట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సిట్ బృందం.. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న డి. ప్రణీత్ రావు, అదనపు ఎస్‌పీలు ఎన్. భుజంగ రావు, ఎం. తిరుపతన్న, మాజీ డీసీపీ పి. రాధా కిషన్ రావులను వరుసగా అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు, ఒక మీడియా సంస్థ ఎండీ శ్రవణ్ కుమార్ (Sravan Kumar) అరెస్ట్ భయంతో అమెరికాకు పరారయ్యారు. సిట్ అధికారుల సూచన మేరకు ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ ను కేంద్రం రద్దు చేసింది. ఇంటర్‌పోల్ ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. 2025 మేలో సుప్రీం కోర్టు.. ప్రభాకర్ రావుకు అరెస్టు నుండి తాత్కాలిక రక్షణ కల్పించడంతో పాటు విచారణలో పాల్గొనాలని ఆదేశించింది. దీంతో ఇవాళ ఆయన హైదరాబాద్ కు చేరుకొని సిట్ విచారణకు హాజరయ్యారు.