Mohan Babu: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబుతో పాటు విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ వంటి వారంతా ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై తెరకెక్కుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 27న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గుంటూరులో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. (Kannappa Pre Release Event)
Also Read- NBK111: బాలయ్య 111వ సినిమా ఫిక్స్.. దర్శకుడెవరంటే..?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నేను స్వయంకృషితో పైకొచ్చాను. ఆ విషయం అందరికీ తెలుసు. మా అమ్మకి పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు. అందరూ నా వాయిస్‌ని మెచ్చుకుంటుంటే ఆ వాయిస్ మా అమ్మకి వినిపిస్తే ఎంత బాగుండేది అనుకునేవాడిని. భయం అనేది జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు. నేను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు? అదే విద్యాలయాల్లో పిల్లలకు నేర్పిస్తున్నాను. మోహన్‌బాబు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లెందరో ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండమని చెబుతుంటాను. ‘కన్నప్ప’ సినిమాని ఆ పరమేశ్వరుడే ఆశీర్వదించాడు. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశాం. నా బిడ్డ విష్ణు ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు. ఎలా ఈ సినిమా తీశాడు అనేది నేను చెప్పదలచుకోలేదు. అది రేపు సినిమా విడుదలైన తర్వాత అంతా మాట్లాడుకుంటారు.
Also Read- Udaya Bhanu: ‘హరి హర వీరమల్లు’ పరువు తీసేసిన యాంకర్ ఉదయభాను.. వీడియో వైరల్!
నా కంటే చిన్నవాడు, నా బావ ప్రభాస్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమిద్దరం బావా బావా అని పిలుచుకుంటాం. మా మధ్య ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఈ సినిమాలో చేయాలని అడగడానికి ఫోన్ చేస్తే.. దీనికి మీరు రావాలా? నేను చేస్తున్నాను. మిగతా విషయాలు విష్ణు, నేను మాట్లాడుకుంటామని అన్నాడు. ఆ ఒక్కమాటే.. వచ్చి సినిమా చేశాడు. డియాలోనే కాదు, వరల్డ్ వైడ్‌గా ఉన్న టాప్ హీరోలలో ప్రభాస్ ఒకడు. సినిమాలో నటించాలని కోరిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన వందేళ్లు క్షేమంగా ఉండాలి. ఆయన పెద్దనాన్న కృష్ణంరాజుతో మా ఫ్యామిలీకి ఎంతో మంచి అనుబంధం ఉంది. మోహన్ లాల్ వర్సటైల్ యాక్టరే కాదు భారత్ గర్వించదగ్గ నటుడు. ఈ మధ్యనే మలయాళంలో ఆయన నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘కన్నప్ప’ సినిమాలో చేయమని అడిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పాడు. శరత్ కుమార్, అక్షయ్ కుమార్ కూడా వెంటనే ఓకే చెప్పారు.
బ్రహ్మానందం కల్మషం లేని వ్యక్తి. మా కాంబినేషన్‌లో ఎన్నో సక్సెస్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో నటించిన వారందరినీ ఆ భగవంతుడే ఈ సినిమాలోకి రప్పించాడు. ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్‌గా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నాకు డ్యాన్స్ అంటే ఏంటో నేర్పించారు. ఈ సినిమాకు రథసారధి ముకేశ్ కుమార్ సింగ్. ఆయన డైరెక్ట్ చేసిన ‘మహాభారతం’ 16 సార్లు చూశాను. ‘కన్నప్ప’ను ఆయన అద్భుతంగా తీశారు. జూన్ 27న రాబోతోన్న ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చివరిగా, ‘బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తలదించిన వాడు బాగుపడతాడు, కాదని ఎదిరించిన వాడు వాగులో పడతాడు’.. ‘నిన్న జరిగింది మరిచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను.. దటీజ్ రామన్న’ అంటూ ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమా డైలాగ్స్ చెప్పి మోహన్‌బాబు అందరినీ అలరించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు