YSRCP: ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ ‘సాక్షి’ (Sakshi) టీవీ చర్చా వేదికలో జర్నలిస్టు కృష్ణంరాజు (Journalist Krishnam Raju) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఇదంతా వైసీపీకి చెందిన సాక్షి చానెల్‌లో జరగడంతో మరింత రచ్చగా మారింది. సీన్ కట్ చేస్తే.. వైసీపీనే ఆయనతో ఇలా చెప్పించందనే దాకా వచ్చేసింది. ఇంత దారుణ వ్యాఖ్యలు చేయడమేంటి? తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడుంది? వైఎస్ జగన్ ఎక్కడున్నారు..? అమరావతి (Amaravathi) పరిధిలో కాదా? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఓ వైపు రైతులు, మరోవైపు ప్రజా సంఘాలు, మంత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంకా చెప్పాలంటే చేజేతులారా వైసీపీ చేసుకున్నది.. పార్టీకి పెద్ద డ్యామేజీ అంటూ టాక్ నడుస్తున్న తరుణంలో వైసీపీకి కృష్ణంరాజు సంబంధమేంటి? ఇంతకీ ఆయన వైసీపీ మనిషేనా? అంటూ వైసీపీ కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.
Read Also- Savitha: మంత్రి సవితకు ఏమైంది.. ఈ వీడియోలో నిజమెంత?
మాకేం సంబంధం?
‘ సాక్షి టీవీ చర్చా వేదికలో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వైసీపీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ.. ఆపార్టీకి చెందిన నాయకులు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న కొన్ని మీడియా సంస్థలు విస్తృతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నంచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టు కృష్ణంరాజు వైసీపీ చెందినవారు కాదు. పాత్రికేయుడిగా మాత్రమే ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. అంతేకానీ.. వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం’ అని వైసీపీ ప్రకటనలో పేర్కొన్నది. కాగా, సామజిక సమస్యను రాజకీయానికి ముడిపెడితే రాష్ట్రానికే నష్టం అంటూ సాక్షి డిబేట్‌పై కృష్ణంరాజు వివరణ ఇచ్చారని ‘జగనన్న కనెక్ట్స్’ (Jagananna Connects) అనే ఎక్స్ ఖాతా నుంచి పోస్టు వచ్చింది. మరోవైపు.. సాక్షి ఛానెల్ తరఫున కొమ్మినేని శ్రీనివాసరావు (కేఎస్ఆర్) క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. సీన్ కట్ చేస్తే.. వైసీపీకి సంబంధం లేదంటూ అధికారిక ప్రకటన చేయడం గమనార్హం.
తప్పకుండా ఖండిస్తాం..!
‘ ఏ వేదికమీద అయినా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి. మా పార్టీ అభిప్రాయంకూడా ఇదే. కానీ, మా పార్టీకి సంబంధంలేని వ్యక్తి, టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే, అవి వైసీపీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా టీడీపీ, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అడ్డంపెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యులమీద టీడీపీ సోషల్ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా, అనైతికంగా పోస్టులు పెడుతూ, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం.. వాటిని ఏ మాత్రం సమర్థించడంలేదు. సాక్షి టీవీ ప్రజలకు ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నాం. అదే సమయంలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టంచేస్తున్నాం’ అని వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
Read Also-Sonia Gandhi Health: సోనియా గాంధీకి పెరిగిన బీపీ.. తాజా పరిస్థితి ఏంటంటే?