– రిజర్వేషన్లను టచ్ చేస్తే.. తోడ్కలు తీస్తాం బిడ్డా!
– ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం
– కాంగ్రెస్ మండల్ కమిషన్ తెస్తే.. బీజేపీ కమండల్ యాత్ర చేసింది
– దెబ్బ తగలడంతో మోహన్ భాగవత్ స్టేట్‌మెంట్
– తెలంగాణ పోరాటం లెక్క రిజర్వేషన్ల రక్షణకు సిద్ధం కావాలి
– బీజేపీ నాయకులను నిలదీయండి
– గొల్ల కురుమ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్
Reservations: గాంధీ భవన్‌లో నిర్వహించిన గొల్ల కురుమ ఆత్మీ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని అన్నారు. ఇప్పుడు దెబ్బ తగలడంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ బయటికి వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారని, కానీ, దాని అసలు వైఖరి రిజర్వేషన్ల వ్యతిరేకమే అని తెలిపారు. రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ మండల్ కమిషన్ తెస్తే జీర్ణించుకోలేక బీజేపీ కమండల్ యాత్ర చేసిందని గుర్తు చేశారు. ఆత్మగౌరవం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు బీజేపీ నుంచి బయటికి రావాలని పిలుపు ఇచ్చారు. రిజర్వేషన్లు అంటే అసహ్యంగా భావించే, వ్యతిరేకించే బీజేపీని ఓడగొట్టాలని సూచించారు.
రిజర్వేషన్లు ముట్టుకుంటే మాడి మసైపోతారని పొన్నం అన్నారు. ఒక మంత్రిగా కాదు.. ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నానని, ప్రతి ఊరిలో రిజర్వేషన్లు కాపాడుకోవడానికి జేఏసీలు వేసుకుని పోరాటం చేయాలని అన్నారు. తెలంగాణ పోరాటం లెక్కనే రిజర్వేషన్లను కాపాడుకోవడానికి పోరాడాలని సూచించారు. బీజేపీ కుల గణనకు వ్యతిరేకం అని చెప్పారు. తద్వార బీసీలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్ల వాటా దక్కడాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా అని పేర్కొన్నారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. ఈ విషయం ఉత్తరాది ప్రజలు తెలుసుకోగలిగారని, అందుకే బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్లను టచ్ చేస్తే తోడ్కలు తీస్తామని ఘాటు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీకి 400 సీట్లు వస్తే బీసీలు ఆగం అవుతారని అన్నారు. ఇప్పుడు విమర్శలు ఎక్కువ కావడంతో బీజేపీ నాయకులు మాట మారుస్తున్నారని, తాము వ్యతిరేకం కాదని చెబుతున్నారని పేర్కొన్నారు.
Also Read: మోదీ అంటే మోసం!
తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని, తెలంగాణ గురించి వారేం చేశారని పొన్నం నిలదీశారు. రాష్ట్రంలో ఎన్ని గుడులను నిర్మించారనీ ప్రశ్నించారు. మంగళసూత్రాలు తెంచే సంస్కృతి తమది కాదని, ఆస్తులు ఇచ్చిన చరిత్ర తప్పా గుంజుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు లేదని తెలిపారు. మోడీ నైతికంగా దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. గొల్ల కురుమ కార్పొరేషన్‌ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అయితే.. కురుమ కార్పొరేషన్ వేరుగా ఏర్పాటు చేయాలని బీర్ల ఐలయ్య కోరారని, దానికి సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని, ఎన్నికల కోడ్ అయిపోగానే ఏర్పాటు చేస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
గాంధీ భవన్‌లో గొల్ల కురుమ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇందులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కొల్లూరు మల్లప్ప ఫొటోను గాంధీ భవన్‌లో పెట్టడం సంతోషం అని తెలిపారు. ఎచ్‌పీసీసీగా కొల్లూరు మల్లప్ప పని చేశారని గుర్తు చేశారు. కేసీఆర్, మోడీ గొల్లకురుమలను మోసం చేశాడని, గొర్లు, బర్లు అని కేటీఆర్ కూడా మోసం చేశారని ఆరోపించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేడీ ఇద్దరూ బీసీలను మోసం చేస్తున్నారని, మతాలు, కులాలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. మరోసారి కూడా కేంద్రంలో మోడీ వస్తే దేశ ప్రజలు ఆగమైతారని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని, కురుమలకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇచ్చిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కురుమలకు రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చారని, తనకు టికెట్ ఒస్తే ఓట్లు వేయలేదని, అయితే, బీర్ల ఐలయ్య గెలిచారని, గొర్లు కాసే వాళ్లు రాజకీయంగా ఎదగాలని గద్వాల జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య పేర్కొన్నారు.