Food Poison: ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్‌కు పరమాన్నం కారణమని తెలుస్తోంది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రోగులకు బెల్లం పరమాన్నం వడ్డించారు. అది తిన్న వెంటనే రోగులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ఉదయానికి రోగి కరణ్ చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కరణ్ కు సంబంధించి రిపోర్ట్ ను ఫోరెన్సిక్ పంపామన్న అధికారులు.. అది రాగానే నిజా నిజాలు తేలతాయని స్పష్టం చేశారు.
వెలుగులోకి ఎర్రగడ్డ అక్రమాలు!
ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చకు తావిచ్చిన నేపథ్యంలో.. గత కొంతకాలంగా ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫుడ్ సప్లై చేసే డైట్ కాంట్రాక్టర్ తో ఆస్పత్రి సూపరిండెంట్ కుమ్మక్కు అయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. డైట్ కాంట్రాక్టర్ మైనర్ పిల్లలతో ఆస్పత్రికి భోజనాన్ని సరఫరా చేసేవారని.. దానిని కుక్కలు కూడా తినవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాలు చాలా అపరి శుభ్రంగా ఉండేవని.. ఆసుపత్రికి వచ్చే రూ.5 రూపాయల భోజనాన్ని కూడా సూపరిండెంట్ అనుమతిచ్చే వారు కాదని ఆరోపించారు. అంతేకాదు వాటర్ ట్యాంకులో పురుగులు, కీటకాలు ఉండేవని కూడా తెలిపారు. లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ జేబుల్లోకి వేసుకుంటూ పేషెంట్స్ కి కనీస ఆహారం పెట్టడం లేదు అంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రభుత్వం సీరియస్
ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగు చూసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ స్పందించింది. కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఘటన నేపథ్యంలో ఆర్ఎంవో పద్మజను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. డిశ్చార్జ్ కమిటీ వార్డులో భూపాలపల్లికి చెందిన కరణ్ అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం చనిపోయాడు. దీంతో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read: June 6th Holiday: రేపు హాలీడే అంటూ జోరుగా ప్రచారం.. అందులో వాస్తవమెంత?
92 మందికి అస్వస్థత
ఫుడ్ పాయిజన్ ఘటనలో కరణ్‌తోపాటు 92 మంది అస్వస్థతకు గురయినట్టు తేలింది. వారిలో 18 మందిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలో ప్రత్యేక వంటకాలు చేశారు. డీసీ వార్డు, కోర్టు వార్డుల్లోని రోగులకు భోజనం చేశాక, వాంతులు, విరేచనాలు అయ్యాయి. తాగునీరు కలిషితమైందా? భోజనం నాసిరకమా? అనే దానిపై విచారణ చేపట్టగా.. ఫుడ్ వల్లే అని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో భోజనం కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని ప్రభుత్వం తొలగించింది.