Urea Allocation: యూరియా కేటాయింపుల్లో కేంద్రం అలసత్వం రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ వానాకాలం పంటల సాగుకు రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. నెలవారీ సరఫరా ప్రణాళికను రాష్ట్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో ఏప్రిల్ లో 0.48 లక్షల మెట్రిక్ టన్నులు, మేలో 0.66 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్కువగా సరఫరా చేసింది. ఈ రెండు నెలలలో రాష్ట్రానికి మొత్తం 1.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోత ఏర్పడింది.
0.66 లక్షల మెట్రిక్ టన్నులు కోత 0.03 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా
ఏప్రిల్ లో 1.70లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా 1.22 లక్షల మెట్రి టన్నులు మాత్రమే సరఫరా చేసి 0.48లక్షల మెట్రిక్ టన్నులు కోత విధించింది. మేలో 1.60లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా 0.94 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి 0.66 లక్షల మెట్రిక్ టన్నులు కోత పెట్టింది. జూన్ లో 1.70లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా బుధవారం వరకు 0.03 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. మే వరకు కేటాయించిన 3.30 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం 2.16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయింది. మిగతా 1.14 లక్షల మెట్రిక్ టన్నులకు కూడా జూన్ కేటాయింపులతో కలిపి సరఫరా చేయాల్సిందిగా ఇదివరకే మంత్రి కేంద్రాన్ని అభ్యర్థించారు.
సరఫరాకు ముందస్తు ప్రణాళిక సిద్ధం
అయితే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీజన్ ఆరంభానికి ముందే 5లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నిల్వ ఉంచుకొని, పంటకాలంలో డిమాండ్ కు తగ్గట్లుగా (ఒకవేళ రాక్స్ వచ్చినా రాకపోయినా) సరఫరాకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పంటకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా నిరవధికంగా సాగించేందుకు టీజీ మార్క్ ఫెడ్ ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు ఇప్పించి యూరియా, ఎరువుల సరఫరాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది.
రెండు నెలల కేటాయింపులలో తక్కువగా సరఫరా
గత రెండు నెలల కేటాయింపులలో ఎక్కువభాగం ఇంపోర్టెడ్ యూరియా కేటాయింపుల మీద ఆధారపడటం వలన, ఆ వెసిల్స్ రాకపోవడంతో సమస్య తలెత్తిందని గమనించి, జూన్ లో సింహభాగం దేశియంగా ఉత్పత్తి అయ్యే యూరియా నుంచి సరఫరా చేయాలని మంత్రి కోరారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జూన్ నెలకు రాష్ట్రానికి కేటాయించిన 1.70 లక్షల మెట్రిక్ టన్నులలో 37 శాతం దేశీయ కంపెనీల నుంచి 67 శాతం ఇంపోర్టెడ్ యూరియా నుంచి కేటాయించడం జరిగింది.
అంతేకాకుండా గత రెండు నెలల కేటాయింపులలో తక్కువగా సరఫరా చేసిన 1.14 లక్షల మెట్రిక్ టన్నుల విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మంత్రితుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ని రెండు మూడు రోజులలో ఢిల్లీకి వెళ్లి సంబంధిత అధికారులను కలిసి సమస్య పరిష్కారం దిశగా విజ్ఙప్తి చేయాలని ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం, ఖరీఫ్ సీజన్ ముందుగానే ఆరంభమయ్యే ప్రస్తుత పరిస్థితులలో జూన్ వరకు కేంద్రం కేటాయించిన యూరియా మొత్తాన్ని నిర్ణీత సమయంలో రాష్ట్రానికి సరఫరా చేసే విధంగా చూడాలని బుధవారం కేంద్రానికి మూడవ లేఖ రాశారు. యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.