MLC Kavitha (image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

MLC Kavitha: తండ్రిపై పొగడ్తలు.. కాంగ్రెస్‌కు చివాట్లు.. మహాధర్నాలో కవిత ఏమన్నారంటే!

MLC Kavitha: కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా నిర్వహించింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే.. మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని పేర్కొన్నారు.

కాళేశ్వరం గొప్పతనంపై..
తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా? అభివృద్ధిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? అంటూ మహాధర్నా సందర్భంగా కవిత నిలదీశారు. కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదన్న కవిత.. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చని పేర్కొన్నారు. కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చని తెలిపారు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చని చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌ది గట్టి గుండె
కేసీఆర్ తలపెట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే.. 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తాయని కవిత అన్నారు. 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరమని కొనియాడారు. మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరమని పేర్కొన్నారు. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు అని గుర్తుచేశారు. కేసీఆర్ ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారని కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదని విమర్శించారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరమని కవిత స్పష్టం చేశారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కి సిగ్గుచేటు
మాజీ సీఎం కేసీఆర్ ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని కవిత ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారని గుర్తు చేశారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. 90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైందని కల్వకుంట్ల కవిత అన్నారు.

Also Read: Swetcha Exclusive: మహాధర్నాలో కవిత ప్లాన్ బట్టబయలు.. స్వేచ్ఛ చెప్పిందే నిజమైంది!

బీజేపీపైనా విమర్శలు
మరోవైపు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని నిలదీశారు. గోదావరి ‌ – పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని పట్టుబట్టారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని విమర్శించారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయమని అన్నారు. బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలని అన్నారు. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత స్పష్టం చేశారు.

Also Read This: Botsa Satyanarayana: వైసీపీకి బిగ్ షాక్.. వేదికపై కుప్పకూలిన బొత్స.. ఆందోళనలో కార్యకర్తలు!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?