KTR: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భవిష్యత్తులో లాభమే జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు కలిసి పని చేస్తేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మన దేశ యువత పోటీ పడగలుగుతుందన్నారు. అమెరికా ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులతో డల్లాస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చిన్న,మధ్య తరహా ఐటీ కంపెనీలు ఇండియాలో ఆఫ్ షోర్ సెంటర్ లను ఏర్పాటుచేసే అవకాశం ఉందన్నారు. మూడేండ్లలో తిరిగి అధికారంలో వచ్చిన తరువాత ఐటీ పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ, అనుబంధ పాలసీలతోనే తొమ్మిదేండ్లలో ఐటీ కి హైదరాబాద్ ల్యాండ్ మార్క్ అయిందన్నారు. ఐటీరంగ అభివృద్ధి కోసం ఇన్నోవేషన్, ఇంకుబేషన్ లో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన విధానాలతోనే చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఎదిగిందన్నారు.
ప్లగ్ అండ్ అండ్ ప్లే ఫెసిలిటీస్
ప్రస్తుతం పరిస్థితులలో చాలా టెక్ కంపెనీలు ఇండియాలో తమ ఆఫ్షోర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాయని, టైర్ టూ నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించవచ్చన్నారు. కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా ఏ కంపెనీ కైనా పనిచేయవచ్చని తెలిసిందన్నారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో టైర్ టూ నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించామని తెలిపారు. ఖమ్మం, మహబూబ్ నగర్,నల్గొండ, సిద్దిపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి 10 నగరాల్లో ప్రభుత్వం ఐటీ హబ్ లను ఏర్పాటుచేసి మొదటి సంవత్సరం రెంట్ ఫ్రీ, ప్లగ్ అండ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ తో పాటు ఎన్నో రాయితీలను కల్పించామని చెప్పారు. అలా ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన ఎన్టీటీ డేటా కంపెనీ 500 మంది ఐటీ నిపుణులతో అద్భుతంగా పురోగతి సాధిస్తుందన్నారు.
Also Read: Kaleshwaram Vigilance Report: కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక.. వారిపై క్రిమినల్ చర్యలు!
రాబోయే రెండు దశాబ్దాల్లో అద్భుతాలు
అమెజాన్, గూగుల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు టైర్ టూ నగరాలకు వెళ్ళలేవని, చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు మాత్రమే అక్కడికి చేరగలవన్నారు. ఇండియాలోని టైర్ టూ నగరాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, మంచి రైల్, రోడ్ కనెక్టివిటీతో రాబోయే రెండు దశాబ్దాల్లో అద్భుతాలు జరుగుతాయన్నారు. దేశాభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పన ఎంత ముఖ్యమో కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్నారు. మీలాంటి వారి కోసమే ఇండియాలోని యువత ఎదురు చూస్తుందని, పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. పలువురు ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి మందగించిందన్నారు. కేటీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.
రిస్కు తీసుకున్నప్పుడే కలలు సాకారం కేటీఆర్:
రిస్కు తీసుకున్నప్పుడు మాత్రమే కలలు సాకారం అవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకుకేసీఆర్ జీవితమే సాక్ష్యమన్నారు.14 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరూ కేసీఆర్ పై ప్రశంసల కురిపించారన్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో చదువుకుంటున్న విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామన్నారు.
ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరపున ప్రయత్నం చేస్తామన్నారు. విద్యార్థులు కూడా అమెరికా చట్టాలను అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకొని మసులుకోవాలని సూచించారు. స్థానిక చట్టాలతో పాటు ఇక్కడి పరిస్థితులను ప్రతీ ఒక్క విద్యార్థి అవగాహన చేసుకోవాలన్నారు. ర్యాంకుల కోసమో, గ్రేడ్ల కోసమో కాకుండా జీవితంలో సాధించాల్సిన ప్రధాన లక్ష్యాల పైన దృష్టి పెట్టాలన్నారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలన్నారు.
Also Read: Gadwal District: పేదల వైద్యానికి తప్పని తిప్పలు.. మొక్షమెప్పుడో!