IAS officer Alugu Varshini: విద్యార్థులను కించపరిచేలా కామెంట్లు చేశారని ఐఏఎస్ అధికారిణి అలుగు వర్షిణిపై నేషనల్ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకుల స్టూడెంట్స్‌పై చేసిన వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని కోరారు. ఆ కామెంట్స్‌పై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని నేషనల్ ఎస్సీ కమిషన్ సీఎస్, డీజీపీకి ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం 15 రోజుల్లో రిపోర్టు అందాలని కోరారు. కమిషన్‌కు సంపూర్ణమైన రిపోర్టు రాకుంటే తదుపరి చర్యలకు వెళ్లాల్సి ఉంటుందని డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు పేర్కొన్నారు. ఈ అంశంపై సర్కార్‌లో చర్చంశనీయమైంది. ఇప్పటికే సోషల్ మీడియా ప్రభావంతో నష్టపోతున్న సర్కార్‌కు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహానికి బలి కావాల్సి వస్తున్నదని ఓ సీనియర్ మంత్రి ఆఫ్ ది రికార్డులో అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలోనూ సీఎం ప్రోగ్రామ్‌లో ఐఏఎస్ కాళ్లు మొక్కడం అంశం హాట్ టాపిక్‌గా మారగా, తాజాగా గురుకుల విద్యార్థులు టాయిలెట్లు కడగడం అంశం ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందుల్లోకి తీసుకువెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఇష్యూస్‌పై త్వరలో సీఎంతో డిస్కషన్ చేసి, పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
కాంట్రవర్సీలకు కేరాఫ్?
ఐఏఎస్ అధికారిణి, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి కాంట్రవర్సీ కామెంట్స్‌పై సర్కార్ అసంతృప్తితో ఉన్నది. ‘గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగడం, ఎవరి రూమ్ వాళ్లే క్లీన్ చేసుకోవడంలో తప్పేంటి’ అని ఆమె మాట్లాడినట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రతిపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వెంటనే అలుగు వర్షిణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్ సర్కార్‌ను ఇరకాటంలో పడేశాయని ప్రభుత్వ పెద్దలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు.బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ద్వారా ఇప్పటికే డ్యామేజ్ అవుతున్నామని భావిస్తున్న సర్కార్‌కు, అలుగు వర్షిణి కామెంట్లు మరింత విమర్శలకు దారి తీశాయి. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలకు మరో అస్త్రాన్ని ఇచ్చినట్లు అయింది.
లీకులతో మరో కొత్త సమస్య
అక్కడితో ఆగకుండా ఈ టాపిక్ ను డైవర్షన్ చేయాలని ప్రయత్నించి అలుగు వర్షిణి మరో కొత్త సమస్యను సృష్టించారు. టాయిలెట్లు అంశంపై ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నాయకుల నుంచి సర్కార్‌పై తీవ్రంగా ప్రెజర్ పెరగడంతో గురుకులాల్లో స్కామ్ అంటూ ఐఏఎస్ అలుగు వర్షిణి కొన్ని మీడియా సంస్థలకు వాట్సాప్ ద్వారా లీకులు ఇచ్చారు. ఎస్సీ గురుకులాల్లో 2017–2020 మధ్య నిధులు గోల్‌మాల్ జరిగినట్లు ఆడిట్‌లో తేలినట్లు ఆమె ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే ఆయా మీడియా సంస్థలకు వివరించారు. ఆ తర్వాత అధికార పక్షంపై , ప్రతిపక్షాలు తమ విమర్శలను మరింత స్పీడ్ పెంచాయి. బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దళిత విద్యార్థలకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. మిస్ వరల్డ్‌కు పెద్దపీట వేసి, పేద పిల్లలకు అన్యాయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలా గురుకులాల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ప్రభుత్వ పాలనను పాలిటిక్స్‌లోకి తీసుకువచ్చారని వర్షిణిపై మంత్రులు కూడా సీరియస్‌గా ఉన్నారు.
నేరుగా ప్రకటించడం ఏంటి?
అలుగు వర్షిణి ఎపిసోడ్‌పై సర్కార్ సీరియస్‌గా ఉన్నది. వాస్తవానికి స్కామ్ జరిగితే సంబంధిత ఆధారాలను ప్రభుత్వం ముందు ఉంచాలి. ఎంక్వైరీ వేసి కచ్చితమైన వివరాలను సేకరించి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సర్కార్‌కు రిపోర్టు పంపాలి. ఇవేమీ జరగకుండా ఆమె నేరుగా స్కామ్ అంటూ లీకులు ఇవ్వడంపై సీఎంవో వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పైగా ఆమె బాధ్యతలు తీసుకున్న చాలా రోజుల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టడంపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. కాంట్రవర్సీ కామెంట్లు చేసిన తర్వాత, స్కామ్‌లు అంటూ లీకులు ఇలా ఒకదాని తర్వాత మరోక మిస్టేక్ చేయడంపై సర్కార్ కూడా తప్పుబడుతున్నది. ప్రభుత్వానికి రిపోర్టు చేయకుండా పొలిటికల్ లీడర్ల తరహాలో మీడియాకు లీకులు ఇవ్వడంపై కూడా సీఎంవో వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఇదే అంశంపై ప్రభుత్వం ఆమెను వివరణ కోరాలని భావిస్తున్నది.
Also Read: Panchayats In TG: పల్లె వాసులకు షాక్.. అటకెక్కిన కొత్త పంచాయతీల అంశం.. ఎందుకంటే?
నిత్యం విమర్శలే?
ఏఐఏస్ అధికారిణి అలుగు వర్షిణి ఉద్యోగులతో సఖ్యతతో మెలగరని స్వయంగా ఎస్సీ గురుకుల ఉద్యోగులే చెబుతున్నారు. ఇటీవల ఉపాధ్యాయులను విమర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత గురుకులాల్లో మేల్ స్టాఫ్స్‌ను తొలగించి, ఫీమేల్స్‌తో భర్తీ చేయాలని ప్రణాళికలు రూపొందించారని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు సరైన వసతిలు కల్పించలేదని స్వయంగా ఓ మంత్రి ఫోన్‌లో ఆగ్రహం చేసినట్లు సమాచారం. పైగా విద్యార్థులు ఫెయిల్ అయితే, ఎస్సీ గురుకులాల నుంచి సప్లిమెంటరీ ఫీజు కట్టలేదనే ఆరోపణలు వచ్చాయి. అసిస్టెంట్ కేర్ టేకర్స్‌ను తొలగించారని చాలా మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా గతంలో ఆమె పనిచేసిన వివిధ శాఖల ఉద్యోగులు కూడా ఆమె పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారిణి హోదాలో ఉండి ఆమె పొలిటికల్ స్టైల్‌లో కామెంట్లు చేస్తున్నారనే చర్చ ఇప్పుడు ప్రభుత్వంలోనూ జరుగుతుంది.