Panchayats In TG: రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని,ఆ మాట నిలబెట్టుకునేందుకు సిఫార్సులు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే 250 వరకు పంచాయతీరాజ్ శాఖకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఆ దరఖాస్తులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు సైతం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఆ దరఖాస్తుల్లో ప్రభుత్వం విధించిన నియమనిబంధనలకు లోబడి లేకపోవడంతో పెండింగ్ పెట్టినట్లు తెలుస్తున్నది. త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికల వరకు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు జరుగదని తెలిసింది.
రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నూతనంగా మరో 250 గ్రామ పంచాతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు అందజేశారు. అయితే, ఆ దరఖాస్తులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఆ 250 దరఖాస్తు గ్రామాల్లో సుమారు 37 గ్రామాల్లో మాత్రమే 500 జనాభా ఉన్నట్లు తేలింది. మిగిలిన గ్రామాల్లో జనాభా తక్కువగా ఉందని సమాచారం. వికారాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో సుమారు 90 కుటుంబాలు మాత్రమే ఉండగా దాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫార్సు లేఖను పంపినట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల మేరకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలంటే 500 జనాభా ఉండాలని, గ్రామానికి గ్రామానికి మధ్య 3 కిలో మీటర్ల దూరం ఉండాలని పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నట్లు తెలిసింది. ఆ నిబంధనల మేరకు లేకపోవడంతో అన్ని దరఖాస్తులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. త్వరలో జరుగబోయే ఎన్నికల నాటికి నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు ఉండబోదనేది స్పష్టమవుతున్నది.
ప్రభుత్వంపై ఎమ్మెల్యేల ఒత్తిడి
త్వరలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో జరుగనున్నాయి. ఆ లోగా తమ తమ నియోజకవర్గాల్లో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై, అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతుందని, పార్టీకి ఎన్నికల్లో కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే పార్టీకి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, మరోసారి ప్రజలు మాట కూడా వినని పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యేలు అధికారులతో పేర్కొంటున్నట్లు సమాచారం. తమను దృష్టిలో ఉంచుకొని నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రతి రోజూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా నిధులు వస్తాయని, గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని, పాలనా సౌలభ్యం కూడా ఉంటుందని, తాను ఎమ్మెల్యేగా గ్రామాలు ఏర్పాటు చేశామని గుర్తింపు, గౌరవం దక్కుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడనుందనే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉన్నట్లు తెలిసింది.
Also Read: Telangana Formation Day 2025: గత పదేళ్లు అంతా విధ్వంసం.. ఇప్పుడు దేశానికే ఆదర్శం.. టీపీసీసీ చీఫ్
గత ప్రభుత్వ తప్పిదాలతోనే పెండింగ్?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 3వేలకు పైగా తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. జనాభాను సైతం పరిగణలోకి తీసుకోకుండా గ్రామాలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంపై పెను భారంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాలను ఏర్పాటు చేశామని గత పాలకులు పేర్కొన్నప్పటికీ వసతుల కల్పనలో మాత్రం వెనుకంజ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటి రోడ్డు సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన సైతం లేదనే ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో మళ్లీ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే విమర్శల పాలవుతామని, పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఏర్పాటు చేస్తే బాటుంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం, అధికారులు వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పట్లో మాత్రం నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు పెండింగ్ పడిందని తెలిసింది. గతేడాది అక్టోబర్‌లోనే 223 నూతన గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.