Telangana Formation Day 2025: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్ (Gandhi Bhavan) లో ఘనంగా వేడుకలు జరిగాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన టీపీసీసీ చీఫ్.. తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పారు. ఆరు దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర సాధన నిరీక్షనకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) తెరదించిందని పేర్కొన్నారు.
పదేళ్ల విధ్వంసాన్ని అధిగమిస్తూ..
ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరమ్మ ఆశయాలకు తెలంగాణ ద్వారా న్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా కాంగ్రెస్ పాలన సాగుతోందని చెప్పారు. బీఆర్‌ఎస్ (BRS) పదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం బాటలో పయనిస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కళ్ల సిద్ధాంతంతో పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ చెప్పారు.
దేశానికే మార్గదర్శకం
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ సంకల్పమన్న టీపీసీసీ చీఫ్.. శాస్త్రీయ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇందులో భాగంగా చేపట్టినవేనని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణతో దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ నిలిచిందని.. దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలన్నది రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆకాంక్ష అని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Also Read: Manchu Manoj: ఆ స్టార్ హీరో రి రీలీజ్ మూవీ నా సినిమాని చంపేసింది.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్
సంక్షేమాలతో ఉపశమనం
రాజీవ్ యువ వికాస్ ద్వారా 5 లక్షల యువతకు ఆర్థిక సాయం చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheeme) ప్రారంభించామని.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని అన్నారు. తద్వారా 50 లక్షల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వ లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పారు. అలాగే రూ.500 గ్యాస్ సబ్సిడీ 40 లక్షల కుటుంబాలకు ఉపశమనం కల్పించినట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం రూ. 21,000 కోట్ల రుణమాఫీ చేసి 25 లక్షల రైతులకు స్వాంతన కల్పించామని గుర్తుచేశారు. రూ.500 వరి బోనస్ తో సన్న బియ్యం ఉత్పత్తి పెరిగిందన్న టీపీసీసీ చీఫ్.. 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య దిగుబడితో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు.