BJP MLAs: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పై టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు కేసీఆర్ కోవర్టే టీపీసీసీ చీఫ్ అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. ఈమేరకు బీజేపీ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, రామారావు పవార్, పైడి రాకేవ్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు ప్రకటన విడుదల చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ బీజేపీకి, ఎంపీ ఈటలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణ ఉద్యమనేతగా ఈటలకు ఉన్న తిరుగులేని ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ కట్టు కథలతో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ఈటల ఫాంహౌజులో భేటీ
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యే అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ శామీర్ పేటలోని ఓ ఫాంహౌజులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుతో భేటీ అయి, అక్కడి నుంచి మాజీ సీఎం కేసీఆర్ తో ఫోనులో మాట్లాడినట్టు మహేష్ కుమార్ గౌడ్ నిరాధార ఆరోపణలు చేశారన్నారు. హరీశ్ రావుతో ఈటల ఏ ఫాంహౌజులో భేటీ అయ్యారో? అందుకు సంబంధించిన ఆధారాలేంటో 24 గంటల్లోగా మహేశ్ కుమార్ గౌడ్ బయటపెట్టాలని, లేదంటే అదంతా కట్టుకథే అని అంగీకరించి తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు కోరాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
AlsoRead: R Narayana Murthy: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ.. పీపుల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
కవితకు పరోక్ష మద్దతు
కాంగ్రెస్ లో కేసీఆర్ కు అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నది టీపీసీసీ చీఫేనని, నిజామాబాద్ కు చెందిన మహేష్ కుమార్ 2014 లోక్ సభ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు పరోక్ష మద్దతు ఇచ్చారని, ఈ విషయమై కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన మధుయాష్కీ గౌడ్ పార్టీ అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారని సమాచారం ఉందన్నారు. కవితతో ఉన్న సఖ్యత కారణంగానే ఆమెను కాంగ్రెస్ లోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాలని మహేష్ గౌడ్ పార్టీ హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ టార్గెట్
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కసరత్తు జరిగిందంటూ కవిత నిరాధార వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆ అంశంపై బీజేపీని విమర్శించాలంటూ ఇచ్చిన సూచన మేరకు మహేష్ కుమార్ గౌడ్ దరుద్దేశపూరితంగా ఎంపీ ఈటలను, బీజేపీని టార్గెట్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు సీబీఐ విచారణ కోరడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి పోర్టల్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఈ-కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.
Also Read: AP Politics: ప్రజా జీవితంలో ఫెయిల్ అయ్యిందెవరు.. జగన్ వర్సెస్ లోకేష్!