MLC Kavitha: హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో తన నివాసానికి పక్కనే ఉన్న తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారని.. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మని వ్యాఖ్యానించారు. కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి.. జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు.
సీఎంగా రేవంత్‌కు అర్హత లేదు!
జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చిలో కూర్చొనే అర్హత లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ గ్రహచారం బాగలేక తెలంగాణకు రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యారని విమర్శించారు. రాజీవ్ యువ వికాసం పేరును వెంనటే మార్చాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. అమరులు శ్రీకాంత చారి లేదా యాది రెడ్డి లేదా కాళోజి లేదా పీవీ నరసింహా రావు పేరు పెట్టాలని సూచించారు.
నీళ్లపై రేవంత్ మౌనం ఎందుకు?
తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడని పరిస్థితి ఏర్పడిందని కవిత అన్నారు. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా సీఎం కనీసం స్పందించించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సీఎం అంత బలహీనంగా ఉన్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారని రేవంత్ ను ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తుపాకులగూడెం నుంచి చేపట్టాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచి చేపడుతామని చెప్పిందని స్పష్టం చేశారు.
గోదావరి నీళ్లు శాశ్వతంగా దూరం
పోలవరం నుంచి 200 టీఎంసీల గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గోదావరి నీళ్లు తెలంగాణకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. జూన్ 2 నాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం డిమాండ్ చేయాలని కోరారు. 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలనే లక్ష్యంతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని కవిత అన్నారు.
కాళేశ్వరం నోటీసులపై ప్రశ్నలు
ప్రతీ ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కోటి ఎకరాల మాగాణం చేసిందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా? అని నిలదీశారు. ‘రైతులను రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ ప్రతీ తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారని.. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడమంటే.. యావత్తు తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లు కవిత వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు చురకలు
కేసీఆర్ పిడికిలికెత్తి బయటికి వస్తేనే తెలంగాణ వచ్చిందన్న కవిత.. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నారని కాంగ్రెస్ కు చురకలు అంటించారు. ఆ విషయాన్ని మరిచిపోయి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దారుణమని కవిత పునరుద్ఘటించారు. ఈ నేపథ్యంలోనే నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టబోతున్నట్లు కవిత మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది మందితో మహా ధర్నా చేపడుతామని పేర్కొన్నారు.
బీజేపీకి వార్నింగ్
మరోవైపు తెలంగాణ జాగృతి.. బీసీ బిల్లు కోసం గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడలేదని గుర్తుచేశారు. బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైల్ రోకో వంటి కార్యక్రమాన్ని చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, మహిళలకు రూ. 2500, ఆడపిల్లలకు స్కూటీలు సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం కొనసాగుతుందని కవిత అన్నారు.
మైనారిటీల కోసమూ జాగృతి
మైనారిటీ హక్కుల కోసం కూడా జాగృతి పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మైనారిటీ హక్కుల కోసం ముస్లీం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాగృతి తరఫున ఎస్సీ, ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామని అన్నారు. మేం పోరాటం చేస్తుంటే ఓర్వలేని కొంత మంది చాలా మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే.. మరో కన్ను జాగృతి అని పేర్కొన్నారు. కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకోబోమని ఆమె స్పష్టం చేశారు.
Also Read: MLA Mallareddy: ఇదేందయ్యా ఇది.. టైమ్ ట్రావెల్ చేసిన మల్లారెడ్డి.. బుద్ధుడితో భేటి!
ఆ వాదాన్ని జాగృతే నిలబెట్టింది
తెలంగాణ కోసం బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం దారుణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 8 మంది ఎంపీలను గెలిపించినా కేంద్రం నుంచి ఒక్క రూపాయిని తీసుకురాలేదని మండిపడ్డారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడకపోతే తెలంగాణ జాగృతి పవర్ ను చూపిస్తామని కవిత అన్నారు. తెలంగాణ వాదాన్ని నిలబెట్టింది జాగృతి అన్న ఆమె.. దానిని స్థాపించి దాదాపు 18 ఏళ్లు కావొస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ అంశంపై అయినా బలంగా గొంతెత్తింది జాగృతి, కేసీఆర్ మాత్రమేనని కవిత స్పష్టం చేశారు. గతంలో అశోక్ నగర్ లో ఉన్న కార్యాలయాన్ని ప్రస్తుతం బంజారాహిల్స్ మార్చినట్లు కవిత పేర్కొన్నారు.