Seed Packets – Nadigadda: ఒకప్పుడు కాటన్ సీడ్‌కు ప్రసిద్ధి చెందిన నడిగడ్డలో ప్రస్తుతం సాగు విస్తీర్ణం తగ్గుతోంది. కూలీల ఖర్చు, విత్తన ప్యాకెట్ల ధరలు తక్కువగా ఉండటంతో సీడ్ కంపెనీలు కర్ణాటకలోని గజేంద్రగడ్ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో నడిగడ్డలో విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సి వస్తోంది.
తగ్గుతున్న విస్తీర్ణం..
నూజివీడు, రాశి, మైకో, కావేరి, దాన్య వంటి ప్రధాన సీడ్ కంపెనీలు జోగులాంబ గద్వాల జిల్లాలో కేవలం 30 శాతం విత్తనాలను మాత్రమే కేటాయించాయి. ప్రతి సంవత్సరం 45 వేల ఎకరాలకు పైగా సీడ్ సాగు జరిగే ఈ ప్రాంతంలో, కంపెనీల వైముఖ్యం వల్ల సాగు విస్తీర్ణం తగ్గనుంది. మొగ్గ రుద్దడం ద్వారా వచ్చే విత్తనాల ప్యాకెట్ ధర రూ. 600 నుంచి రూ. 500కు, పూత పూత రుద్దడం ద్వారా వచ్చే విత్తనాల ధర రూ. 500 నుంచి రూ. 410 – 430కి తగ్గింది. కూలీల ఖర్చు గట్టు, ధరూర్ మండలాల్లో రూ. 18 నుంచి -20 వేలు ఉండగా, ఐజ, మల్దకల్ మండలాల్లో రూ. 22- నుంచి 24 వేల వరకు ఉంది. ఎకరా సాగుకు సుమారు రూ. 1.50 లక్షల వరకు ఖర్చవుతోంది.
కమిషన్ల కోసం లాబీయింగ్
ప్రధాన కంపెనీలు అధిక పంట వచ్చిందని చెప్పి ఆర్గనైజర్లకు విత్తనాలు ఇవ్వకపోవడంతో చిన్న కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సీడ్ అసోసియేషన్ సభ్యుల ఐక్యత లేకపోవడం, కమిషన్ల కోసం లాబీయింగ్ వంటి కారణాల వల్ల కంపెనీలు ఇక్కడ సాగుపై ఆసక్తి చూపడం లేదని ఆర్గనైజర్లు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది రైతుల లాట్లు జీవోటీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయి. డిలీటింగ్ ప్రక్రియ కోసం కంపెనీలు పంటను రాయచూర్, నంద్యాలకు తరలిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం, జీవోటీ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్ల రైతులు నష్టపోతున్నారు.
Also Read: GHMC Monsoon Tenders: జీహెచ్ఎంసీ టెండర్లలో గోల్‌మాల్.. కాంట్రాక్టర్లు, అధికారుల కక్కుర్తి!
కలెక్టర్‌తో కంపెనీల సమావేశం..
ఖరీఫ్‌లో అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో పత్తి విత్తనాలే ప్రధాన ఆదాయ మార్గమని, సుమారు 30 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని తెలిపారు. సాగు విస్తీర్ణం తగ్గడంపై కలెక్టర్ ఆర్గనైజర్లను ప్రశ్నించగా, కొందరు బ్లాక్‌మెయిల్ రాజకీయాల వల్ల కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్గనైజర్ల తరఫున పటేల్ ప్రభాకర్ రెడ్డి వివరించారు. అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, సీడ్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని, బాల కార్మికులను అనుమతించకూడదని స్పష్టం చేశారు. కంపెనీలు లైసెన్స్, జీఎస్టీ నంబర్ వంటి వివరాలు ఇవ్వడం లేదని డీఈవో తెలిపారు. రీ-జీవోటీ నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.