Eatala Rajendar: కవిత (Kavitha) జైలులో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ (BRS) ప్రయత్నం చేయొచ్చు కానీ బీజేపీ (BJP) నుంచి ఎవరూ ప్రయత్నించలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా, తెలంగాణలో ఇవాళ ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఎవరిని కలుస్తారు?
తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటున్నారని, కలిసి ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ వాదుల్లో కొందరు చనిపోయారని, మరికొందరు ఇంకెక్కడో ఉన్నారన్నారు. కవిత దగ్గర కనీసం ఉద్యమకారుల లిస్ట్ ఉందా అని చురకలంటించారు. పక్క రాష్ట్రం ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని, తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే బాగుండని ప్రజలు భావిస్తున్నారని ఈటల అన్నారు.
మాకేం అవసరం?
బీజేపీలో బీఆర్ఎస్ ఎందుకు విలీనమవుతుందని, తామెందుకు చేసుకుంటామని వ్యాఖ్యానించారు. నక్సల్స్ అంశంపై కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంభించారని విమర్శలు చేశారు. అధికారంలోకి రాక ముందే జైలుకు వెళ్లి కూర రాజన్నను కలిశారని, అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే ఆయనలో భూమికి ఆకాశానికి మధ్య అంత తేడా వచ్చిందన్నారు. ఇటీవల బీఆర్ఎస్ సభలో ఆపరేషన్ కగార్ ఆపాలని కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
Read Also- Telangana: త్వరలో కవిత రెండో లేఖ.. హరీశ్ నేతృత్వంలోనే చీలిక రాబోతోందా?
కేసీఆర్‌ను నమ్మి మోసపోయాం
బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయబోదని ఈటల వ్యాఖ్యానించారు. నీచ రాజకీయాల తాము చేయబోమన్నారు. పదేండ్లలో కేసీఆర్‌ను నమ్మి మోసపోయారని, ఆ తరువాత కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మరోసారి మోసపోయారన్నారు. పక్క రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతోందని, అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు.
గాలి వార్తలపై మాట్లాడను
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే గాలి వార్తలకు తాను సమాధానం చెప్పబోనని వ్యాఖ్యానించారు. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అయితే దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ ఎదురుపడితే నమస్కారం పెడతానని, అది సంస్కారమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఒక ఎంపీగా, మాజీ ఆర్థిక మంత్రిగా హాజరవుతానని స్పష్టం చేశారు.
సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత
అంతకుముందు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. అది కూడా తాను జైలులో ఉన్న సమయంలో ఇది జరిగిందని, తాను ససేమిరా అన్నట్టు చెప్పారు. బీజేపీ ఎన్నాళ్లు జైలులో ఉంచుతుందో చూస్తానని వ్యాఖ్యానించినట్టు వివరించారు. అంతేకాకుండా, సొంత పార్టీలో జరుగుతున్న పరిణమాలను కూడా ప్రశ్నించారు. కవిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కాగా, ఈటల రాజేందర్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
Read Also- Kavitha And Sharmila: ఓరి బాబోయ్.. కవిత, వైఎస్ షర్మిల ఇలా సింక్ అవుతున్నారేంటి?