Pawan Kalyan – Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన చంద్రబాబుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ సంకల్పంతో ఆవిర్భవించిన టీడీపీ.. చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతోందని అన్నారు. అపార అనుభవం, దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయకత్వం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పవన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అందులో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
2024 ఎన్నికల్లో చారిత్రక విజయం
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో టీడీపీ ఆవిర్భవించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. సీఎం చంద్రబాబు (CM Chandra Babu) ప్రగతిశీల నాయకత్వంలో పార్టీ అంచెలంచెలుగా ఎదిగిందని పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉంటూ.. 2024 ఎన్నికల్లో NDA కూటమిలో భాగమై టీడీపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని పవన్ గుర్తుచేశారు. ఈ విజయం తర్వాత తొలి మహానాడు జరగడం శుభ సందర్భమని చెప్పారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, శ్రీ @ncbn గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉంది.
2024 ఎన్నికల్లో NDA కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత @JaiTDP ఘనంగా…
— Pawan Kalyan (@PawanKalyan) May 29, 2025
విఫ్లవాత్మక మార్పులకు శ్రీకారం
మహానాడు కార్యక్రమంలో 12వ సారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ అభినందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ‘సైబరాబాద్’గా మార్చి, ఐటీ రంగంలో చంద్రబాబు విప్లవాత్మక మార్పులు తెచ్చారని పవన్ అన్నారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలను ఆకర్షించారని చెప్పారు. 1999లో “ఆంధ్రప్రదేశ్ విజన్ 2020” పత్రాన్ని రూపొందించి.. ఆర్థిక సంస్కరణలు సాంకేతికత ఆధారిత అభివృద్ధి వైపు పయనింపజేశారని చంద్రబాబును కొనియాడారు.
రాష్ట్రానికి మార్గదర్శకం
సీఎం చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం రాష్ట్రానికి మేలు చేకూరుస్తుందని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి మీరు మరింత కృషి చేయాలనే ఆకాంక్షతో ఈ నూతన బాధ్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో రాసుకొచ్చారు.
Also Read: Kavitha on KTR: నీకెంటి నొప్పి.. కేసీఆరే నాకు బాస్.. కేటీఆర్‌పై కవిత ఫైర్!
చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఇదిలా ఉంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా ఈ విషయాన్ని పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య (Varla Ramaiah) అధికారికంగా ప్రకటించారు. అనంతరం బుధవారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ‘నారా చంద్రబాబు నాయుడు అను నేను’ అని సీఎం అనగానే ఒక్కసారిగా మహానాడు సభ హర్షద్వానాలతో దద్దరిల్లింది. ‘జై బాబు’ నినాదాలతో మార్మోగింది. ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు.. ధ్రువపత్రాన్ని చంద్రబాబుకు అందజేశారు.