Meenakshi Natarajan: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలతో మీనాక్షి భేటీ అయ్యారు. క్యాడర్ ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ మైలేజ్ ఎలా ఉన్నది, ప్రభుత్వం, పార్టీ సమన్వయంలో సమస్యలు ఉన్నాయా, పార్టీ బలోపేతం కోసం ఇంకా ఏం చేద్దాం, నియోజకవర్గాలు వారీగా ప్రధాన సమస్యలు ఏమిటీ, అనే అంశాలపై వన్ టు వన్ నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు కంటెస్డెట్ ఎమ్మెల్యేలతోనూ చర్చించారు.
నియోజకవర్గాల్లో పదవులు పొందాల్సిన అర్హత ఎవరెవరికి ఉన్నది, పార్టీ కోసం ఏం చేశారు, ప్రభుత్వ పనితీరుపై జనాలు ఏమనుకుంటున్నారనే అంశాలను మీనాక్షి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో లీడర్‌కు పది నిమిషాలు చొప్పున సమయం ఇచ్చారు. ఆయా లీడర్లు చెప్పిన వివరాలను మినిట్స్ రూపంలో మీనాక్షి సేకరించారు. ఈ వివరాలు ప్రకారం ఓ రిపోర్టు తయారు చేసి ఏఐసీసీకి కూడా పంపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. మిగతా పార్లమెంట్ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ నేతలతో మరో భేటీ నిర్వహించనున్నారు. ఇక మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ కల్పిస్తే బాగుంటుంది, ఆశావహుల్లోని ఒక్కొక్కరిపై మీ అభిప్రాయం ఏమిటీ, అంటూ మీనాక్షి లీడర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం గమనార్హం.
Also Read; Cm Revanth Reddy: బీఆర్ఎస్ గొర్రెలు, బర్రెలు ఇస్తే.. మేం ఉద్యోగాలిచ్చాం.. సీఎం రేవంత్
మాదిగ ఎమ్మెల్యేలు వినతి
క్యాబినెట్ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలంటూ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మందుల సామ్యూల్, లక్ష్మీకాంతరావులు మీనాక్షికి వినతి పత్రం ఇచ్చారు. అంతేగాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కూడా ఇచ్చారు. గురువారం ఢిల్లీలోని అగ్రనేతలకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మరింత మైలేజ్ వచ్చిందని, మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చాక 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
బాచుపల్లిలో జై హింద్ ర్యాలీ
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గురువారం జై హింద్ ర్యాలీతో పాటు సభను కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి, మంత్రులు పాల్గొననున్నారు.ఆపరేషన్ సింధూర్‌ను రాజకీయాలకు వాడుకుంటున్నారని బీజేపీపై ఎటాక్ చేయనున్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలకు మౌనంగా ఉన్న ప్రధాని మోదీ తీరును ఎండగట్టనున్నారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు దేశం యావత్ అండగా ఉందని సంఘీభావం తెలపాలన్న సంకల్పంతో ఏఐసీసీ పిలుపు మేరకు జై హింద్ యాత్ర ర్యాలీ చేపడుతున్నది.
Also Read: Kalvakuntla Kavitha: దళిత బిడ్డలంటే కాంగ్రెస్ కు ఇంత వివక్షా?.. కవిత సంచలన కామెంట్స్!