KTR: కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి చీప్ క్వాలిటీది కాదని, తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలే చీప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మండిపడ్డారు. కనీస పరీక్షలు చేయకుండా, ఎలాంటి శాస్త్రీయ డేటాను సేకరించకుండానే తయారుచేసిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తిరస్కరించడమే ఇందుకు సాక్ష్యమన్నారు. బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికే కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓ అశాస్త్రీయ నివేదికను ఇచ్చిందన్న నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశాయన్నారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఆ తప్పుల తడక నివేదికతో కాంగ్రెస్, బీజేపీలు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
Also Read: Jeedimetla police: మావోయిస్టుల పేర బెదిరింపు లేఖ.. ఇద్దరు నిందితుల అరెస్ట్!
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమన్న సంగతి ఎల్ అండ్ టీ తాజా నిర్ణయంతో మరోసారి ప్రజలకు తెలిసిందన్నారు. ఊహ ఆధారంగా రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో ఆ రిపోర్ట్ ను తయారుచేశారని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీఏ నివేదిక అని తాము పిలవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమన్నారు.
కేసీఆర్ కు పేరొస్తుందనే రాజకీయ దుగ్ధతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు.
Also Read: Kalvakuntla Kavitha: దళిత బిడ్డలంటే కాంగ్రెస్ ఇంత వివక్షా?.. కవిత సంచలన కామెంట్స్!
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని సూచించారు. లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్-బీజేపీలు చేస్తున్న కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కుట్ర సిద్ధాంతాలను సృష్టించినా.. వాస్తవం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అయితే కేసీఆర్ దార్శనికుడన్నారని పేర్కొన్నారు.
Also Read: Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!