Harish Rao – KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరు అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తొలిసారి కమిషన్ ముందుకు రావాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao).. కేసీఆర్ (KCR) తో భేటి అయ్యారు.
ముచ్చటగా మూడోసారి!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇటీవలే హరీష్ రావు రెండుసార్లు వ్యక్తిగతంగా కలిశారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై చర్చించారు. తాజాగా మూడోసారి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సుమారు 4 గంటల పాటు నేతలు చర్చించారు. కమిషన్ ముందు ఉత్పన్నమయ్యే ప్రశ్నలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు విజిలెన్స్ నివేదికలో ఏం పేర్కొన్నారు? ఎక్కడ లోపాలు జరిగాయి? NDSA ఏం చెప్పింది? అన్న అంశాలపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది.
వారికి ఫోన్.. ఆ విషయాలపై ఆరా!
విచారణకు హాజరైన అధికారులను కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడిగింది? ఇంజనీర్లు ఏం సమాధానాలు చెప్పారు? అన్న విధంగా కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బ్యారేజీ కుంగడంపై సాంకేతిక కారణాలను సైతం తెలియజేయాలని సదరు అధికారులను కేసీఆర్ సూచించినట్లు సమాచారం. పై అన్ని అంశాలపై చర్చించి ఓ నివేదికను సిద్ధం చేసుకునే పనిలో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా కవిత ఎపిసోడ్ పైనా హరీష్ రావు, కేసీఆర్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
జూన్ 5న కమిషన్ ముందుకు!
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉండగా.. హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి ఇటీవల కమిషన్ నోటీసులు ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ ను జూన్ 5న విచారణకు రావాలని సూచించింది. అలాగే హరీశ్‌రావును జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే జూన్ 5న కమీషన్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: Sr NTR Speech: మహానాడులో ఏఐ అద్భుతం.. కదిలొచ్చిన అన్నగారు..
విచారణలో కమిషన్ దూకుడు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ గత ప్రభుత్వ హయాంలోనే కుంగిపోయింది. దీంతో ఆ ప్రాజెక్ట్ కింద నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్.. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, నీటిపారుదల, పే అండ్ ఎకౌంట్స్, ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులు.. ఇలా అందరినీ విచారించింది. ఈ క్రమంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.