RK Roja Arrest: వైసీపీ ముఖ్య మహిళా నేత రోజా (R.K. Roja)ను త్వరలో అరెస్ట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీ శాప్ ఛైర్మన్ రవి నాయుడు (Ravi Naidu) తాజాగా చేసిన కామెంట్స్ ఇందుకు ఊతం ఇస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజా క్రీడ్రా మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ‘ఆడుందాం ఆంధ్రా’ (Aadudam Andhra) పేరుతో భారీ ఎత్తున క్రీడా కార్యక్రమానికి ఆమె తెరలేపారు. అయితే ఆ క్రీడా పోటీల్లో భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయలని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ సైతం జరుపుతోంది. ఈ క్రమంలో ఏపీ సాప్ ఛైర్మన్ రవి నాయుడు తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.
సాప్ ఛైర్మన్ ఏమన్నారంటే?
మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత ఆర్.కే. రోజాపై ఏపీ సాప్ ఛైర్మన్ రవి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడలు, టూరిజం పేరుతో ఆమె తినేసిన కోట్ల రూపాయలపై త్వరలోనే లెక్క తేలబోతున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి రోజాతో పాటు బాధ్యులైన ఎవరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ లో ఏ సంఘానికి గుర్తింపు లేదన్న ఆయన.. తమకు తాముగా ప్రకటించుకున్న మూడు సంఘాలను పక్కన పెట్టినట్లు చెప్పారు. కబడ్డీ అసోసియేషన్ లో రాజకీయాలు, నిధులు దుర్వినియోగంపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాలకు దూరంగా క్రీడలు ఉండాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను తాము పాటిస్తున్నట్లు చెప్పారు.
రోజాపై ఆరోపణలు ఏంటంటే?
గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2023 డిసెంబరు 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు అప్పటి క్రీడా మంత్రి రోజా ఆధ్వర్యంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. అయితే ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి రోజా రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గతంలో మాట్లాడుతూ 47 రోజుల్లో రూ.119.19 కోట్ల రూపాయలు వృథా చేశారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే భూమన అఖిల ప్రియ సైతం ఈ కార్యక్రమంలో జరిగిన ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తారు. రోజాతో పాటు మాజీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy)పై కూడా ఆరోపణలు చేశారు.
Also Read: Jal Shakti Abhiyan: జలశక్తి అభియాన్‌లో దేశంలోనే.. తెలంగాణ 3వ స్థానం!
రోజా స్పందన ఇదే!
ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను గతంలోనే రోజా ఖండించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన టెండర్లను క్రీడాశాఖ పిలవలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ఖర్చు 100 కోట్లు అయితే, స్కామ్ కూడా 100 కోట్లు అనడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె ప్రశ్నించారు. కాగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో 25,40,972 మంది క్రీడాకారులు పాల్గొనగా.. విజేతలకు రాష్ట్ర స్థాయిలో 5 లక్షలు, రన్నరప్‌లకు 3 లక్షలు, సెకండ్ రన్నరప్‌లకు 2 లక్షలు బహుమతులుగా అందజేశారు.