Banoth Madanlal: తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీకి చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ అకస్మికంగా కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రి (AIG Hospital)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తెల్లవారుజామున..
గతవారం ఖమ్మంలోని నివాసంలో బాణోత్ మదన్ లాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఏఐజీకి తరలించారు. ఈ క్రమంలోనే అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా గుండెపోటుతో రావడంతో ఆయన ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. మదన్ లాల్ (Banoth Madanlal) మృతితో వైరా నియోజకవర్గంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
వైసీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి
మదన్ లాల్.. తొలుత వైసీపీ (YSRCP)లో క్రీయాశీలకంగా పనిచేశారు. 2014లో వైసీపీ తరపున తెలంగాణలో పోటీ చేసి వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి మదన్‌లాల్ ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.
సీఎం సంతాపం
మదన్ లాల్.. అకస్మిక మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైరా మాజీ ఎమ్మెల్యే మరణంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సైతం స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్మి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
తీరని లోటు: కేటీఆర్
మదన్ లాల్ మృతిపై బీఆర్ఎస్ పార్టీ సైతం సంతాపం తెలియజేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రజానాయకుడిగా, ఎమ్మెల్యేగా వైరా నియోజక వర్గ ప్రజలకు ఆయన విశేష సేవలు అందించారని కేటీఆర్ కొనియాడారు. ఆయన మరణం నియోజక వర్గ ప్రజలకు తీరని లోటని చెప్పారు. మదన్ లాల్ గారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.