Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఫిక్స్అయ్యింది. జూన్8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్గ్రౌండ్లో దీనిని పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ జోన్ డీసీసీ శిల్పవల్లి నేతృత్వంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లపై సమన్వయ సమావేశం జరిగింది. మొత్తం 21 ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, నిర్వాహక సంస్థ, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు దీంట్లో పాల్గొన్నారు. చేప ప్రసాదం పంపిణీ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖలవారీగా చర్చించారు. గత యేడాది లోపాలను సమీక్షించి ఈసారి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
వీఐపీలు వచ్చినా సాధారణ జనాలకు ఇబ్బంది కలగకుండా ఈసారి ఎక్కువ సంఖ్యలో చేప ప్రసాదం పంపిణీ స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక, చేప ప్రసాదం తీసుకోవటానికి వచ్చే వారిని మోసం చేసే ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని నిరోధించటానికి నిఘా పెంచాలని డీసీపీ శిల్పవల్లి సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ తోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తే రద్దీ తగ్గే అవకాశాలు ఉంటాయని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై బత్తిని కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నారు.
Also Read: Fake Documents: నకిలీ ఇండ్ల పట్టాల దందా.. రెచ్చిపోతున్న అక్రమార్కులు!
మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ జరగలేదు
ఆస్తమా పేషెంట్ల కోసం హైదరాబాద్‌లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. దాదాపు 170 ఏళ్లకు పైగా ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగుతోంది. 170 ఏళ్లుగా ప్రతి సంవత్సరం నిరంతరాయంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తుండగా 2020లో కరోనా కారణంగా చేప పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలా మూడేళ్ల నుండి చేప ప్రసాదం పంపిణీ జరగలేదు. ఈ సంవత్సరం నుండి తిరిగి ప్రారంభం అవుతోంది.
చేప ప్రసాదం అంటే ఏంటి?
1845 నాటి నుండి ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు బత్తిని సోదరులు చెబుతున్నారు. ఆస్తమాను నయం చేయడానికి తమ పూర్వీకులు ఈ చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ చేప ప్రసాదంలో బతికి ఉన్న కొర్రమీను చేపను అలాగే మింగాల్సి ఉంటుంది. ఈ చేప నోట్లో పసుపు రంగులో ఉండే మూలికలతో తయారు చేసిన పదార్థం పెడతారు. ఆ తర్వాత బతికున్న కొర్రమీను చేపను అలాగే మింగేస్తారు. సీక్రెట్ ఫార్ములాతో ఈ పసుపు పదార్థం తయారు చేస్తామని బత్తిని సోదరులు చెబుతున్నారు. శాకాహారులకు అయితే బెల్లంలో ఈ పసుపు పదార్థాన్ని కలిపి ఇస్తారు.
Also Read: GHMC officials: మళ్లీ మునక తప్పదా?.. పూడికతీత పనులపై అనుమానాలు ఎన్నో?