Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తప్పించుకునే దారులన్నీ మూసుకు పోయాయి. తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ ఆయన చేసుకున్న అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించినట్టు సమాచారం. అదే సమయంలో ప్రభాకర్ రావుపై జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసును అమలు చేయటానికి అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. ఒకవేళ ఇది జరగక పోయినా జూన్ 20వ తేదీలోపు ప్రభాకర్ రావు ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిందేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. లేకపోతే అతడిని ప్రకటిత నేరస్తుడిగా పేర్కొంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఖాయమంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును అరెస్ట్‌చేశారు. ప్రస్తుతం వీళ్లంతా బెయిల్‌మీద బయట ఉన్నారు. ఇక, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావు సుప్రీం కోర్టు కల్పించిన మధ్యంతర రక్షణతో ఇటీవల సిట్ ఎదుట హాజరయ్యారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మాత్రం విచారణకు హాజరు కాలేదు.
అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి
కేసులు నమోదు కాగానే అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఆయనను వెనక్కి రప్పించేందుకు దర్యాప్తు అధికారులు చర్యలను ముమ్మరం చేయడంతో తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. అదే సమయంలో దర్యాప్తు అధికారులు సీబీఐ సహకారంతో ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించారు. పాస్ పోర్టును కూడా రద్దు చేయించారు. దాంతోపాటు ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా గుర్తించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూన్ 20వ తేదీలోపు కోర్టులో హాజరు కావాలంటూ ప్రభాకర్ రావును ఆదేశించింది. ఈ మేరకు జారీ అయిన నోటీసులను ఇటీవల సిట్ అధికారులు తారామతి బారాదరి ప్రాంతంలోని ప్రభాకర్ రావు నివాసానికి అంటించారు. అప్పటికీ అమెరికా ప్రభుత్వం తనను రాజకీయ శరణార్థిగా పరిగణిస్తుందని ప్రభాకర్ రావు ఆశ పెట్టుకున్నారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాకర్ రావు అభ్యర్థనన అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది.
Also Read: Bunny Vas: పవన్ కళ్యాణ్‌నే ఇరిటేట్ చేశామంటే.. బన్నీ వాసు పోస్ట్ వైరల్
ప్రభాకర్ రావు ఆస్తుల జప్తు
అదే సమయంలో ఇంటర్ పోల్ ద్వారా జారీ అయిన రెడ్‌కార్నర్ నోటీసును అమలు చేయడానికి అమెరికా హోం ల్యాండ్ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో అమెరికా పోలీసులు ప్రభాకర్‌రావును భారత్‌కు డిపోట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే లుక్ఔట్ నోటీసులు కూడా జారీ అయి ఉన్న నేపథ్యంలో ఆయన దేశంలోని ఏ ఎయిర్‌పోర్టులో దిగినా వెంటనే అధికారులు అదుపులోకి తీసుకోవడం ఖాయం. ప్రభాకర్ రావును డిపోట్ చేసే ప్రక్రియలో ఆలస్యం జరిగినా జూన్20వ తేదీలోపు ప్రభాకర్‌రావు ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిందేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. లేనిపక్షంలో కోర్టు ఆయనను ప్రకటిత నేరస్తుడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తందన్నారు. ఒక్కసారి ఈ నోటీసులు జారీ అయితే కోర్టు అనుమతి తీసుకుని ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేస్తామన్నారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయినట్టే అని వ్యాఖ్యానించారు.
Also Read: Miss World 2025: అందాల పోటీల్లో అభాసుపాలు.. మొదట్నుంచీ అడ్డంకులే!