IAS Officers: ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య రివ్యూల పంచాయితీ నెల కొన్నది. ఒకే కమిటీలో ఉన్న ఆఫీసర్ల కు ఈ చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకే సమయంలో రెండు వేర్వేరు సమీక్షలు నిర్వహించడం వలన ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. షెడ్యూల్స్ లో క్లాష్ ఏర్పడి ఆఫీసర్ల మధ్య గ్యాప్ పెరగడానికి కారణమవుతున్నది. డిపార్ట్ మెంట్ల మధ్య కో ఆర్టినేషన్ లేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏ రివ్యూకు వెళ్లాలో అర్ధం కాక, ఐఏఎస్ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. కొందరు ప్రాధాన్యతను ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. మరి కొందరు ఏ రివ్యూకూ అటెంట్ కాకుండా డుమ్మా కొడుతున్నారు. ఆయా శాఖల ప్లానింగ్ ఆఫీసర్లు పూర్తిగా ఫెయిలవుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది. తద్వారా ప్రభుత్వ పాలసీలు, ప్రాజెక్టులు, ప్రోగ్రామ్ ల నిర్వహణ ఆలస్యమవుతున్నాయి. సాక్షాత్తు సెక్రటేరియట్ లో ఈ సమస్య నెలకొనడం ఆశ్చర్యంగా ఉన్నది. సమన్వయంతో వర్క్ చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఐఏఎస్ లకు, ఇతర ఉన్నతాధికారులకు సూచించారు. కానీ కొందరు ఆఫీసర్లు చేస్తున్న నిర్లక్ష్యం ప్రభుత్వ పాలన లో జాప్యానికి ఆజ్యం పొస్తున్నది. పైగా కొందరు ఐఏఎస్ లు ఇగోలకు వెళ్లి, ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చేలా వ్యవహరిస్తున్నట్లు సచివాలయంలోని ఓ అధికారి ఆఫ్‌ది రికార్డులో చెప్పారు.
సుల్తానియా వర్సెస్ వికాస్ రాజ్?
ఇటీవల సెక్రటేరియట్ లో డీపీసీ(డిపార్ట్ మెంట్ ప్రమోషనల్ కమిటీ) మీటింగ్ జరిగింది. ఈ డీపీసీకి చైర్మన్ గా వికాస్ రాజ్ వ్యవహరిస్తుండగా, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు మరి కొందరు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉన్నారు. అయితే మీటింగ్ నిర్వహించిన రోజు అందరూ హాజరు కాగా, సందీప్ కుమార్ సుల్తానియా మాత్రం అటెండ్ కాలేదు. దీనిపై ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కీలక మీటింగ్ కు హాజరు కాకపోవడం ఏమిటీ? షెడ్యూల్ ముందే ఇచ్చాం కదా? ఎందుకు డుమ్మా కొట్టారు? అనే అంశాలపై ఇతర అధికారుల నుంచి వికాస్ రాజ్ సమాచారం తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా గైర్హాజరుపై సందీప్ నుంచి వివరణను కూడా కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఇతర అధికారులు కూడా షాక్ గురయ్యారు. ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా బాధ్యతలునిర్వహిస్తున్నారు. డీపీసీ మీటింగ్ జరిగిన రోజు ఫైనాన్స్ కు సంబంధించిన ఇతర అంశాల షెడ్యూల్ ఉన్నట్లు సందీప్‌కుమార్ సుల్తానియా తనకు దగ్గరగా ఉన్న ఆఫీసర్లకు చెప్పినా, ఇది సరైన విధానం కాదని వికాస్ రాజ్ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ కీలక అధికారి అయినప్పటికీ, డీపీసీలో వికార్ రాజే బాస్. దీంతో ఆయన ఆదేశాలను పాటించాల్సిందేనని జీఏడీ అధికారుల్లో ఒకరు తెలిపారు. వీరిద్దరి మధ్య ఉమ్మడి ఏపీ నుంచే విభేదాలు ఉన్నాయని మరో అధికారి తెలిపారు.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ యూకే క్విట్..
సౌత్ వర్సెస్ నార్త్ ఆఫీసర్లు?
ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య కూడా చీలికలు ఏర్పడ్డాయనే ప్రచారం జరుగుతున్నది. సౌత్ వర్సెస్ నార్త్ ఆఫీసర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతున్నదట. రెండు టీమ్ లుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఏర్పడి, పాలిటిక్స్ తరహాలో వ్యవహరిస్తున్నట్లు సెక్రటేరియట్ లో చర్చ జరుగుతున్నది. సౌత్ ఆఫీసర్లు చెప్పిన సలహాలు, సూచనలు, అభిప్రాయాలను నార్త్ అధికారులు లైట్ తీసుకొంటున్నారని, ఇదే సమయంలో నార్త్ అధికారులు చెప్పిన ఫీడ్ బ్యాక్ ను సౌత్ అధికారులూ పక్కన పెడుతున్నారనే ప్రచారం కూడా ఉన్నది. దీని వలన ప్రభుత్వ పాలనలో సమస్యలు వస్తున్నాయని కింది స్థాయి అధికారులు మండిపడుతున్నారు. పైగా సౌత్ కంటే నార్త్ ఆఫీసర్లకే ప్రభుత్వంలోని కీలక శాఖలు ఇచ్చారు. దీంతో సౌత్ అధికారుల్లోని కొంత మంది అసహానానికి గురవుతున్నారు. గత ప్రభుత్వంలోనూ నార్త్ ఆఫీసర్లకే ప్రయారిటీ ఇచ్చారని, ప్రజా ప్రభుత్వంలోనూ అదే రిపీట్ అవుతున్నదని కొందరు ఐఏఎస్ అధికారులు ఫీలవుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు అతి దగ్గరగా ఉన్న ఐఏఎస్ అధికారులకూ ఈ ప్రభుత్వంలోనూ పెద్దపీటే వేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, జయేష్ రంజన్ కు ఈ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు ఇవ్వగా, కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో తన శాఖలో వర్క్ చేసిన నర్సింహా రెడ్డికి కన్ఫార్డ్ ఐఏఎస్ ప్రమోట్ కు కృషి చేశారు. ఇక మంత్రి హరీష్ రావు దగ్గర పనిచేసిన అశోక్ రెడ్డికి కూడా గత ప్రభుత్వంలోనే కన్ఫార్డ్ ఐఏఎస్ ఇచ్చారు. వీరిద్దరికీ ఈ ప్రభుత్వంలోనూ ప్రయారిటీ ఇచ్చారనే చర్చ ఉన్నది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్ల కావడంతోనే ప్రాధాన్యత ఇచ్చినట్లు కొందరు అధికారులు వాపోతున్నారు. ఆఫీసర్ల మధ్య పంచాయితీతో ప్రభుత్వ పాలనలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే ప్రతిపక్షాలకు లీకులు కావడం, కింది స్థాయిలో ఆ ప్రోగ్రామ్స్, ఫాలసీలు, పథకాలను సరైన రీతిలో చేరేందుకు తగిన స్థాయిలో చొరవ తీసుకోకపోవడం వంటివి జరుగుతున్నాయి. దీని వలన సర్కార్ కు బ్యాడ్ నేమ్ వస్తుందని కింది స్థాయిలోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు.
Also Read: Mahabubabad: మహబూబాబాద్ ఆర్టీవో ఆఫీసులో అక్రమ వసూళ్లు.. డోంట్ కేర్!