KCR: పార్టీలో అంతర్గత విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారం వస్తున్న విమర్శల పైన పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కవిత లేఖ, జరుగుతున్న ప్రచారం పై సుమారు గంటకు పైగా చర్చించారు. అదేవిధంగా గత నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ, సభ తర్వాత జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పైన చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు కార్యచరణ పై సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేయడం పైనే ఫోకస్ పెట్టాలని కేటీఆర్ కు సూచించారు. అందుకు అనుగుణంగా కార్యచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. జూన్ రెండో వారంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థ గత కమిటీల ఏర్పాటు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. త్వరలోనే షెడ్యూల్ కూడా తయారు చేయాలని ఆదేశించారు. పార్టీ కమిటీల తర్వాత క్యాడర్ కు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సూచించారు. డిజిటల్ సభ్యత్వ నమోదుకు సాంకేతికంగా జరుగుతున్న ఏర్పాట్లు, రూపొందిస్తున్న యాప్ కు సంబంధించిన వివరాల పైన పలు సూచనలు చేశారు.
త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం
త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కేటీఆర్ కు సూచించారు. సభ్యత నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలను నేతలకు ఇవ్వాలని సూచించారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని అన్నారు. అదేవిధంగా పార్టీ పైన సమీక్షించాలని ఆదేశించారు. నేతలకు సభ్యత నమోదు పై టార్గెట్ కూడా విధించాలని సూచించారు. ప్రతి సభ్యత్వాన్ని కంప్యూటర్ లో భద్రపరచాలని అన్నారు.
Also Rerad: Ponnam Prabhakar: విధుల్లో నిజాయితీగా పనిచేయాలి.. రవాణాశాఖకు మంచి పేరు తేవాలి!
కవిత ఎపిసోడ్ పై చర్చ
ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ వెలుగులోకి రావడం తర్వాత జరిగిన పరిణామాల పైన కెసిఆర్ కు కేటీఆర్ వివరించినట్లు తెలిసింది. ఆసక్తిగా కేసీఆర్ విన్నట్లు తెలిసింది. కోవర్టుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ అంశాలు పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పార్టీలో విభేదాలు ఉన్నట్లు వస్తున్న విమర్శలు టిఆర్ఎస్పై ప్రభుత్వం చేస్తున్న ప్రచారం తదితర అంశాలపైన కేటీఆర్ వివరించినట్లు తెలిసింది. పార్టీలో విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించవద్దని కెసిఆర్ సూచించారు.
జూన్ రెండున రాష్ట్ర అవతరణ వేడుకలు
అమెరికాలోని డల్లాస్ లో జూన్ 1న పార్టీ రజతోత్సవ సభను ఎన్నారైలు నిర్వహిస్తున్నారు. ఈ సభకు కేటీఆర్ హాజరవుతున్నారు. అందుకు ఈనెల 28న హైదరాబాద్ నుంచి కేటీఆర్ వెళ్తున్నారు. అమెరికా పర్యటన నేపథ్యంలో ప్రసంగించిన అంశాల పైన చర్చించారు. ప్రవాస తెలంగాణ వాసులతో సభ అనంతరం జరపాల్సిన అంశాల పైన కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించాలని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను ఎమ్మెల్సీ మధుసూదనాచారికి అప్పగించాలని కెసిఆర్ నిర్ణయించారు. కెటిఆర్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రెండో వారంలో సభ్యత్వ నమోదు పై సమావేశం నిర్వహించడం పైన సూచనలు చేశారు. పార్టీలో వ్యక్తం అయ్యే అంతర్గత అంశాలపై స్పందించాల్సిన అవసరం లేదని కెసిఆర్ సూచించారు. స్పందిస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ బలోపేతం పైనే దృష్టి సారించాలని కేటీఆర్ ను ఆదేశించారు.
Also Read: Minister Konda Surekha: గిరిజనులను ఇబ్బంది పెట్టొద్దు.. అటవీ అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం!