Kavitha Letter: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ లేఖతో బీఆర్ఎస్ – బీజేపీ లోపాయికార ఒప్పందం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. కవిత లేఖపై తమదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కవిత లేఖపై స్పందించిన బీజేపీ ఎంపీ రఘునందన రావు.. ఆమె మరో షర్మిల కాబోతున్నట్లు కనిపిస్తోందని అన్నారు.
వారసత్వ చిచ్చు.. లేఖతో రుజువు
కవిత రాసి లేఖపై ఓ వీడియో విడుదల చేసిన మెదక్ బీజేపీ ఎంపీ రఘనందన్ రావు (Madavaneni Raghunandan Rao) అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెది రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా? అంటూ ప్రశ్నించారు. కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ (BJP) బలపడుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబం (KCR Family)లో వారసత్వ చిచ్చు వచ్చిందని ఈ లేఖలో రుజువైందని రఘునందన్ రావు అన్నారు. కవిత (Kalvakuntla Kavitha)ను బయటకు పంపించడం కోసం కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఒక్కటి అయ్యారన్న సంకేతం ఆ రజతోత్సవ సభ ద్వారా ఇచ్చారని చెప్పారు.
డ్రామా వెనక సీఎం రేవంత్!
కవిత రాసిన లేఖను బట్టి చూస్తే ఆమె మరో షర్మిల (YS Sharmila) కాబోతున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ కు సంబంధించిన పత్రిక, టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చిందని గుర్తు చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తోందని చెప్పారు. ఇటీవలే హరీష్ రావుతో పార్టీ పెట్టించాలని రేవంత్ అన్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్ కు దగ్గర చేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని మెదక్ ఎంపీ పునరుద్ఘటించారు.
Also Read: Kavitha letter: కవిత లేఖ ఒక డ్రామా.. బీజేపీ-బీఆర్ఎస్ దోస్తీ బట్టబయలు.. కాంగ్రెస్ పార్టీ
బీజేపీకి అంటగడితే ఎలా?
మరోవైపు కవిత లేఖపై మరో బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) సైతం స్పందించారు. ఈ లేఖ బీఆర్ఎస్ చేసిన ఎత్తుగడ అయి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. బీజేపీని వీక్ చేయాలని.. పార్టీ ఎదుగుదులను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ డ్రామాకు తెరలేపాయని ఆరోపించారు. తండ్రికి వ్యక్తిగతంగా రాసిన లేఖ.. ఎలా బయటకు వచ్చిందో కవిత చెప్పాలని డీకే అరుణ పట్టుబడ్డారు. కవితను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం బీజేపీకి లేదన్న ఆమె.. లిక్కర్ స్కామ్ లో విచారణను బీజేపీకి అంటగడితే ఎలాగని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ లబ్దికోసమే లేఖాస్త్రాలను బయటకు తీశాయని విమర్శించారు.