KTR on CM Revanth: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం (Kaleshwaram Project)పై కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ చెప్పిన ప్రజా పాలన కాస్త కమిషన్ల పాలనగా మారిపోయిందని.. వాటి నుంచి దృష్టి మరల్చేందుకే నోటీసుల పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చేశారు
గతంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ (Palamuru Rangareddy lift irrigation)పై సుప్రీంకోర్టులో ఎవరో కేసు వేశారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ గుర్తుచేశారు. అయితే దానిని న్యాయస్థానం కొట్టివేసిందని చెప్పారు. అందులో ఏం తప్పులేదని.. అంతా సక్కగానే జరిగిందని కోర్టు చెప్పిందని అన్నారు. కాళేశ్వరం అనేది ఇంజనీరింగ్ అద్భుతమని అదే సమయంలో సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించినట్లు చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను బీజేపీ, కాంగ్రెస్ దొంగలే బాంబు పెట్టి పేల్చేసి ఉండొచ్చని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు వేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు తోడు దొంగలేనని.. ఎవరినీ నమ్మాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అందాల పోటీలతో సీఎం బిజీ
మరోవైపు మిస్ వరల్డ్ పోటీల (Miss World – 2025) గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 500 మంది అన్నదాతలు చనిపోతే సీఎం రేవంత్.. అందాల పోటీల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై సమీక్ష నిర్వహించే సమయం ముఖ్యమంత్రికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫైల్స్ కదలాలంటే మంత్రుల చెయ్యి తడపాల్సిందేనని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో మంత్రులు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం స్పష్టం చేశారని కేటీఆర్ అన్నారు.
Also Read: Harish Rao Meets KCR: కాళేశ్వరం నోటీసులపై మల్లాగుల్లాలు.. కేసీఆర్‌తో హరీష్ రెండోసారి భేటి!
సీఎం.. రోజుకో మాట చెప్తున్నారు
సీఎం రేవంత్ రెడ్డిలో ఒక అపరిచితుడు దాగున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఒకరోజు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటారని.. మరో రోజు దాని పరిధిలోని మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ కు నీరు ఇస్తామని చెబుతారని గుర్తుచేశారు. ఓ రోజు అప్పు లేదని అంటారని.. మరో రోజు అసెంబ్లీలో రూ.1,70,000 కోట్లు రుణం తీసుకున్నామని చెప్తారని కేటీఆర్ అన్నారు. ఒక రోజు కేసీఆర్ ఆనవాళ్లు తొలగిస్తామని చెప్తారని.. మరొక రోజు కేసీఆర్ కట్టిన ప్రతీది తిరిగి చూపిస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చెప్పారు.