Vana Mahotsav: వన మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. వర్షాకాలంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జూలై మొదటి వారంలో మొక్కలు నాటేలా ప్రాణాళికలు సిద్ధం చేస్తుంది. నర్సరీల్లో మొక్కలు కూడా రెడీగా ఉంచాలని ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే, ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు.
ఆ తర్వాత వాటి సంరక్షణలో నిర్లక్ష్యం కారణంగా చాలావరకు ఎండిపోతున్నాయి. దీనికి తోడు చాలా మొక్కలు అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ కొరవడంతో వృథా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు సైతం నాటిన వాటినన్నింటినీ సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పచ్చదనాన్ని పెంచేందులో భాగంగా ‘వనమహోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందుకు 18.02కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ నిర్ణయించింది. జూలై మొదటి వారంలో వన మహోత్సవానికి శ్రీకారం చుట్టనున్నది. ఈ ఏడాది వన మహోత్సవంలో 18,026,73 మొక్కలు నాటనున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందం సైతం నియమించింది. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు శాఖల వారీగా టార్గెట్ పెట్టింది.
Also read: Rana Naidu Season 2: బూతుల వెబ్ సిరీస్ సీజన్ 2 రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది
ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాకు 89.319లక్షలు.. అత్యల్పంగా సిరిసిల్ల జిల్లాకు 10.385లక్షలు మొక్కలు నాటేందుకు ప్రభుత్వం టార్గెట్ విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 70.654లక్షలు, మేడ్చల్ జిల్లాకు 70.604 లక్షలు, నిర్మల్ జిల్లాకు 69.553 లక్షల మొక్కలను టార్గెట్ పెట్టారు.
ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలు నీమ్, రావి, కనుగ, వేప వంటి మొక్కలను నాటడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇంటింటికీ మొక్కలు ఇచ్చి వాటిని నాటేందుకు అధికారులు మరింత ప్రోత్సహించనున్నారు. ప్రజలు అడిగిన మొక్కలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్లనేరేడు. మునగ, కానుగ, తులసి, ఈతతో పాటు ఔషధ, పూల మొక్కలను కూడా సిద్ధం చేశారు.
అటవీ ప్రాంతాల్లో మరింత ఆహ్లాదాన్ని పెంచే విధంగా పలు పూల, పండ్ల మొక్కలను నాటేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, 2026లో 16.06 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాలను నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు. 2024లో వనమహోత్సవం కార్యక్రమంలో 20.02 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకోగా.. 18.66 కోట్ల (93 శాతం) మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వేగవంతం చేశారు. ఈ సారి నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చర్యలు చేపడుతున్నారు.
మున్సిపల్ కు 8 కోట్లు
పంచాయతీరాజ్ కు 7 కోట్ల మొక్కల లక్ష్యం
రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా మొక్కలు పెంపకం చేపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అమ్మ కోసం.. ఒక చెట్టు’ కార్యక్రమంతో కలిపి వనమహోత్సవాన్ని నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు సైతం ఇచ్చింది.
Also read: Allu Arjun: ఈ విషయం తెలిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ భూమ్మీద నిలబడరేమో..
ఫారెస్టు దినోత్సవంలో భాగంగా మొక్కలను సైతం అధికారులు నాటారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, కళాశాలలు, పాఠశాలల, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల భాగస్వామ్యంతో జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో జూలై మొదటి వారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏశాఖ ఎన్ని మొక్కలు నాటాలన్నది టార్గెట్ విధించారు. 60శాఖలు ఉండగా అందులో అత్యధికంగా మున్సిపల్ శాఖకు 8 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 7 కోట్ల మొక్కలు నాటే బాధ్యతను అప్పగించారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 4.50 కోట్లు, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (టీఎస్ఎఫ్డీసీ), ఫారెస్ట్ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నారు. ఆర్అండ్ బీ, ఆర్టీసీ, ఎన్హెచ్ఏఐ, ట్రాన్స్ ఫోర్ట్ శాఖలు 31.84 లక్షలు, విద్యుత్ శాఖ, సింగరేణి ఆధ్వర్యంలో 25 లక్షలు, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో 10 లక్షలు, అగ్రికల్చరల్, మార్కెటింగ్, హార్టికల్చర్, సెరికల్చర్, సహకారశాఖల ఆధ్వర్యంలో కోటి, రెవెన్యూ, ఎక్సైజ్, ఎండోమెంట్ శాఖలు 27.50 లక్షలు, పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖలు, డిఫెన్స్, మిలటరీ ఆధ్వర్యంలో 8 లక్షలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో 4.51 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు.
పశుసంవర్థక, దాని అనుబంధశాఖల ఆధ్వర్యంలో 1.53 లక్షలు, ఇండస్ట్రిస్ , ఐటీసీ ఆధ్వర్యంలో 14 లక్షలు, భూగర్భగనుల శాఖ 2.50 లక్షలు, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 73 వేలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 52 వేలు, సోషల్ వెల్ఫేర్ (ఎస్సీ, బీసీ) 72 వేలు, ట్రైబల్, ఐటీడీఏ 2.50 లక్షలు, టూరిజం, కల్చరల్, యూత్ అండ్ స్పోర్ట్స్ 10 వేలు, సివిల్ సప్లై 19 వేలు, కార్మికశాఖ 8వేలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 10 వేలు, రైల్వేశాఖ 23 వేలు, ఇతర శాఖల ఆధ్వర్యంలో 1.62 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించి ఆయాశాఖలకు టార్గెట్ కు చెందిన వివరాలు సైతం అందజేశారు.
మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే మనమహోత్సవానికి స్థలాలు గుర్తించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా గ్రామస్థాయి నుంచి స్థలాల ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికను సైతం ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. విద్యార్థుల భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులను వనమహోత్సవంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
Also read: Phone Tapping Case: ప్రభాకర్ రావుకు బిగుసుకుంటున్న ఉచ్చు.. అదే జరిగితే ప్రభాకర్ రావు ఆస్తులు సీజ్!
‘ఒక విద్యార్థి.. ఒక మొక్క’ నినాదంతో ముందుకెళ్తున్నది. నాటిన మొక్కలకు నీరు పోయడం, సంరక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదే విధంగా పర్యావరణ వేత్తలను, క్లబ్‌లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి విద్యార్థి సంఘాలను భాగస్వాములను చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థులకు వన మహోత్సవంపై వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ వంటి పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను ‘గ్రీన్ అంబాసిడర్లు’గా ప్రోత్సహించనున్నారు. సోషల్ మీడియా ద్వారా వన మహోత్సవంపై విస్తృత ప్రచారం చేయనునున్నారు. విద్యార్థుల భాగస్వామ్యం చేయడం ద్వారా వనమహోత్సవం కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహించబోతున్నారు.
సీఎం ప్రత్యేక దృష్టి
వన మహోత్సవం కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. మొక్కలు నాటేందుకు అన్నిశాఖలకు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతీసారి హరితహారంలో లక్ష్యం భారీగా నిర్ణయిస్తున్నారు. కానీ నాటడంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది. మొక్కలు నాటుతున్నా వాటిని సంరక్షించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాటన్నిటికి చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు.
అందుకోసం పర్యవేక్షణకోసం అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాటిన ఒక మొక్క ఎండకుండా చర్యలు తీసుకోబోతున్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపైనా శాఖ పరమైన చర్యలకు సిద్దమవుతున్నారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సైతం ఇప్పటికే వనమహోత్సవంపై అధికారులతో రివ్యూ చేశారు.
Also read: BRS Harish Rao: దేశానికి ఆదర్శంగా తెలంగాణ.. మాజీ మంత్రి హరీష్ రావు!
ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలు నాటాలని, పండ్ల మొక్కలను సైతం ప్రాధాన్యం ఇవ్వాలని, నర్సరీల్లో వన మహోత్సవం ప్రారంభం నాటికి మొక్కలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశాలు ఇచ్చారు. సీఎం సూచనల మేరకు అన్నిశాఖల అధికారులకు టార్గెట్ విధించారు. వనమహోత్సవ కార్యక్రమానికి కంపా, హరితనిధి కి సంబంధించిన నిధులను ఉపయోగించనున్నారు.
టార్గెట్ రీచ్ అవుతాం
పీసీసీఎఫ్ సువర్ణ
వనమహోత్సవానికి ఈఏడాదికి నిర్ణయించిన మొక్కల టార్గెట్ రీచ్ అవుతాం. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుస్తాం. వనమహోత్సవం కు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన చేశాం. ప్రజాప్రతినిధులను, విద్యార్థులను భాగస్వామ్యం చేయబోతున్నాం. వనమహోత్సవానికి కంపా, హరితనిధి కి సంబంధించిన నిధులను ఉపయోగిస్తాం. అడవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.