kotpally project: మధ్యతరహా ప్రాజెక్టు ‘కోట్ పల్లి’ ప్రాజెక్టుకు మంచి రోజులు రానున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టుకు మరమ్మత్తులు కరువయ్యాయి. పొంతన లేకుండా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం వల్ల నిధులు మంజూరు కావడం లేదు. అయితే తాజాగా.. ప్రభుత్వం రూ.90కోట్ల నిధులు కేటాయిస్తూ ఇటీవల జీవోను విడుదల చేయడంతో ప్రాజెక్టు ఆధునీకరణకు ముందడుగు పడినట్లైంది. వికారాబాద్ జిల్లాకు తలమానికంగా ఉంటూ.. అటు పర్యాటకంగా.. ఇటు సాగు నీటి పరంగానూ కీలకంగా ఉన్న కోట్ పల్లి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవం పోసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
త్వరలోనే టెండర్లు
కోట్ పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ కోసం ప్రతి యేటా పంపుతున్న ప్రతిపాదనల ప్రక్రియ ప్రహసనంగా ఉంటోంది. 2011-12లో జైకా నిధులు రూ.24.75కోట్లకు ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపగా..మంజూరవ్వలేదు. 2022లో రూ.124.95కోట్లకు ప్రతిపాదనలు రూపొందించగా ముందడుగు పడలేదు. అన్ని నిధులు అవసరం లేదంటూ అప్పటి ప్రభుత్వం నిపుణులతో అధ్యయనం చేయించి ఆధునీకరణకు రూ.39.32కోట్లు చాలని తేల్చింది. సంబంధిత దస్త్రం ఆర్థికశాఖకు చేరినా అనుమతులు రాలేదు.
Also read: CM Revanth Reddy: చెక్ డ్యాంల నిర్మాణంతోనే సరిపెడ్తారా? నిధులు ఇవ్వాలని రైతులు, ప్రజల డిమాండ్!
2024లో రూ.110కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. చివరికి రూ.64.20కోట్లకు నీటిపారుదల శాఖ నుంచి ప్రభుత్వానికి దస్త్రం వెళ్లినప్పటికీ ఆ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోయింది. తాజాగా మరోమారు పూర్తిస్థాయి ఆధునీకరణకు రూ.124కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇటీవల రూ.90కోట్ల మంజూరుకు సంబంధించి జీవోను విడుదల చేసిందని స్థానిక ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచి కాలువల మరమ్మత్తు పనులను చేపడతామని ఆయన పేర్కొన్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం
వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోని 9,200 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేలా 1962 సంవత్సరంలో కాగ్నా నదిపై కోట్ పల్లి వాగు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు రెండు టీఎంసీల నికర జలాల కేటాయింపు కూడా ఉంది. ప్రాజెక్టును నిర్మించిన తర్వాత ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆధునీకరించిన దాఖలాలు లేవు.
దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు, తూములు చాలావరకు శిథిలావస్థకు చేరాయి. మరమ్మత్తులు లేక ప్రాజెక్టు కట్ట సైతం శిథిలమైంది. ప్రాజెక్టు దుస్థితి కారణంగా ప్రస్తుతం సగం ఆయకట్టుకు కూడా సాగునీరందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఆధునీకరణకు అడుగులు పడుతుండడంతో ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
పర్యాటకంగానూ ఊతం
సాగునీటి పరంగానే కాకుండా కోట్ పల్లి వాగు ప్రాజెక్టు పర్యాటకంగానూ సందర్శకులను అలరిస్తోంది. సెలవులు, ఇతర పర్వ దినాల్లో హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వికారాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు వస్తుంటారు.
Also read: Rajiv Gandhi Death Anniversary: రాజీవ్ గాంధీ చొరవతోనే.. అప్పటి టెక్నాలజీ ఇప్పుడు వాడుతున్నారు!
అనంతగిరి కొండల్లోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాక.. కోట్ పల్లి వాగును సైతం కుటుంబ సమేతంగా సందర్శిస్తారు. అక్కడి ప్రకృతి సోయగంలో తేలి ఆడడంతోపాటు బోటింగ్ చేస్తూ ఆనందోత్సహాలతో గడుపుతారు. ప్రభుత్వం ప్రాజెక్టు ఆధునీకరణకు చేపట్టనున్న చర్యలు పర్యాటకంగానూ ఊతమివ్వనున్నాయి.
‘కోట్ పల్లి’ ప్రాజెక్టు స్వరూపం ఇలా..
ప్రాజెక్టు నిర్మాణ సంవత్సరం: 1967
జలాశయం నీటి మట్టం: 24 అడుగులు
ఆయకట్టు: 9,200 ఎకరాలు
కుడి, ఎడమ కాల్వల పొడవు: 36కిలో మీటర్లు
లబ్దిపొందే గ్రామాలు: పెద్దేముల్, ధారూర్ మండలాల్లోని 18 గ్రామాలు