Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్ కు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేటీఆర్ కు రాజకీయం అంటే తెలీదని విమర్శించారు. తండ్రి చాటున కొడుకుగా వచ్చి కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో పేదవారికి ఇల్లే కట్టలేదని ఆక్షేపించారు. కట్టినా ఏ ఒక్కరికీ పంపిణీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ.. తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపిస్తోందని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని నిలదీశారు. విద్యుత్ రంగంలో కూడా భారీగా అప్పులు చేసి వెళ్లిపోయారని అన్నారు.
అభివృద్ధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, ఎమ్మెల్సీలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.6,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించినట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి రూ.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రూ. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టి పనికిరాని కాళేశ్వరాన్ని నిర్మించిందని దుయ్యబట్టారు. మూడేళ్ల పాటు నిర్మించిన ఆ ప్రాజెక్ట్.. కట్టిన ఏడాదికే కూలిపోయిందని విమర్శించారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి నీరు.. ప్రజలు ఇక్కట్లు!
పదేళ్లు పట్టించుకోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గురించి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదంతోనే ఎస్ఎల్బీసీ లో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై 65 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. మీ చెల్లి (కవిత), మీ నాన్న (కేసీఆర్), మీ బావ (హరీష్ రావు) మీరందరూ కలిసి ముందుగా మీ బీఆర్ఎస్ పార్టీని చూసుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు.