Plastic Usage: ప్లాస్టిక్ భూతం చాప కింద నీరుల పర్యావరణాన్ని కబలిస్తోంది. మన అవసరాలు తీరుస్తూ మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేందుకు విస్తరిస్తోంది. విషవలయంలో ఇప్పటికే చాలావరకు మనకు మనం చిక్కుకున్నాం. ఇప్పటికైనా తేరుకోకపోతే మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం. మహబూబాబాద్ జిల్లాతో పాటు ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాలపై విషం కక్కుతున్న ప్లాస్టిక్ భూతం పై ప్రత్యేక కథనం. ప్రజల దైనందిక జీవనంలో భాగమైన ప్లాస్టిక్ పర్యావరణాన్ని నాశనం చేస్తూ ప్రజలను విష వలయంలోకి నడుతోంది. నింగి, నేల, గాలి, నీరులను కలుషితం చేస్తూ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోంది. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు కేంద్రాల్లో రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం అంతకంతకు పెరిగిపోతుంది.
ఆయా ప్రాంతాల్లో వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను మున్సిపాలిటీ కేంద్రాలకు సంబంధించిన చెరువులు, కుంటల్లో వేయడంతో నీటి కాలుష్యం పెరిగిపోతుంది. అదేవిధంగా డంపింగ్ యార్డులలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటించడంతో గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయి మానవ మనుగడకు ప్రశ్నార్ధకంగా మారిపోతుంది. తొలి నుంచి ప్రమాద స్థాయిని గుర్తించిన అధికారులు కొద్ది సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ వినియోగంపై వచ్చిన ఆంక్షలు కొద్దిరోజులపాటు అమలు చేశారు. అయితే ఆ చర్యలు పూర్తిగా మూన్నాళ్ల ముచ్చటగానే మారాయి. మళ్లీ యధావిధి గానే ప్లాస్టిక్ సంచిల వినియోగం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ఇందుకు డంపింగ్ యార్డ్ లోని క్వింటాళ్లకొద్దీ కనబడుతున్న సంచులే పరిస్థితికి అడ్డం పడుతున్నాయి.
పరిస్థితి ఇంత భయానకంగా మారుతున్న అధికార యంత్రాంగంలో ఎందుకు చలనం లేదో? అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి మార్పు తీసుకురావలసిన అధికారులు కొత్త జిల్లాలు అయితే చేసిన దాఖలాలు లేవు. ఈ విషయంలో మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీలు అయితే చేసింది గుండుసున్న అనే చెప్పాలి. ఆయా జిల్లాల ప్రధాన మండల కేంద్రాల్లోని శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు దర్శనమిస్తుంటాయి. జ్యూస్ పాయింట్లు, హోటల్లు, వివిధ రకాల షాపుల్లో వీటి వినియోగం నిత్య కృత్యమై పోయింది. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసిన పార్సిల్ చేయడం కోసం ప్లాస్టిక్ కవర్ అవసరంగా మారిపోయింది.
Also Read: Gulzar House Fire Accident: ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్.. గుల్జార్ హౌస్‌లో ఇంత ఘోరం ఎలా జరిగింది?
ఇదిగో ప్రమాదం ఇలా పొంచి ఉంది
విచ్చలవిడిగా కొనసాగుతున్న ప్లాస్టిక్ వినియోగంతో అటు పర్యావరణానికి ఇటు మూగజీవుల ప్రాణానికి ముప్పు పొంచి ఉంది. ప్లాస్టిక్ కవర్లు భూమిలో కరిగిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ పడిన భూ ప్రాంతం పూర్తిగా ఎందుకు పనికిరాకుండా పోతుందని సూచనలు చేస్తున్నారు. పంట భూముల్లోకి తాగునీరు అందించే చెరువులు, కుంటల్లోకి చేరుకుంటూ జల కాలుష్యానికి కారణం అవుతోంది. జలచరాలకు మరణ శాసనం రాస్తుంది. ఇన్ని దుష్ఫలితాలు చోటు చేసుకునే ప్లాస్టిక్ నివారణపై జిల్లాల యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శలు పర్యావరణ శాస్త్రవేత్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా స్పందించి మేల్కోవాలి
అతి ప్రమాదకరమైన ప్లాస్టిక్ వినియోగంపై అటు జిల్లాల అధికారులు, ఇటు ప్రజలు పూర్తిస్థాయిలో మేల్కోవాలి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగినట్లు ప్రజల అవగాహన, క్రమశిక్షణ, అధికారుల శ్రద్ధ, దాడులు నిషేధాజ్ఞలను అమలుకు నోచుకుంటాయన్నది నిర్వివాదాంశం. మునిసిపల్, పోలీస్, ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ ల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. అదే సమయంలో ప్రజల్లోనూ సైతం అవగాహన కల్పించి ప్లాస్టిక్ కవర్లని కాకుండా ప్లాస్టిక్ సంబంధించిన వాటిని పూర్తిస్థాయిలో తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టేందుకు నడుం బిగించాలని వివరిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతున్న నేపథ్యంలో మానవాళి జీవన విధానంపై ప్రశ్నార్ధకం నెలకొంది. ప్లాస్టిక్ వాడకంపై ప్రజలు మేల్కొని దుష్పరిణామాలు సంభవించకుండా ప్లాస్టిక్ కవర్లు వాడకాలను మానేయాలి.
రాష్ట్ర ప్రభుత్వ గైడ్లైన్స్ మేరకు ప్లాస్టిక్ నివారిస్తాం
రాష్ట్ర ప్రభుత్వ గైడ్లైన్స్ మేరకు ప్లాస్టిక్ నివారిస్తామని, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో చర్చించారు. ప్లాస్టిక్ సంబంధిత వస్తువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, పర్యావరణ ప్రేమికులు, పర్యావరణ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రజలకు ప్లాస్టిక్ వాడకాలపై అవగాహన కల్పిస్తామని, అందరినీ మోబిలైజ్ చేసి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను చేపడతామని అన్నారు.
Also Read: Harish Rao: మద్యం ప్రియుల పక్షాన హరీష్ రావు.. రేవంత్ సర్కార్‌పై కొట్లాట!