Miss World: మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. అందుకు స్పాన్సర్లను ఆహ్వానించాలని భావించింది. ఈ మేరకు టూరిజం శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అయితే, అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాని పరిస్థితి. వచ్చిన స్పాన్సర్లకు సమయం ఇవ్వకపోవడంతో మళ్లీ వారు సంప్రదించడం లేదు. దీంతో పోటీలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లయింది. మరోవైపు, అధికారుల మధ్య సమన్వయలోపం సైతం కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. నిర్వహణ బాధ్యతలు అప్పగించిన అధికారులు సైతం ఫెయిల్ అయ్యారు.
తెలంగాణలో తొలిసారి.. కానీ!
తెలంగాణలో తొలిసారి ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ ఖర్చు భారం ప్రభుత్వంపై పడకుండా టూరిజం శాఖకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన 112 దేశాలకు చెందిన వారికి బస, వసతులు కల్పన, మౌలిక సదుపాయాల ఖర్చు భరించేందుకు అంగీకరించింది. ఇదే విషయాన్ని మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులకు చెప్పడంతో వారు సైతం అంగీకరించారు.
అయితే, ఈ పోటీలకు దాదాపు 25 లక్షల రూపాయలను టూరిజం శాఖ స్పాన్సర్లతో సమకూర్చుకోవాలని భావించింది. అంతేగాకుండా ఈ పోటీలతో మరో రూ.25 కోట్ల ఆదాయం టూరిజం శాఖకు వస్తాయని అధికారులు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అయితే, అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు వచ్చిన స్పాన్సర్లు సైతం వెనక్కు తగ్గినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాలేదని సమాచారం.
Also read: Land Surveyors: సర్వేయర్ పోస్టులకు నామమాత్రంగా దరఖాస్తులు.. ఎంతంటే?
టూరిజం శాఖ అధికారుల వైఫల్యంతో పోటీల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడింది. టార్గెట్ రూ.25 కోట్లు విధించినప్పటికీ ఒక్క స్పాన్సర్ రాలేదు. దాంతో అణా పైసా ప్రభుత్వానికి రాలేదు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పటికీ స్పాన్సర్లు రాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.
అంతా ఆ ఇద్దరి వల్లేనా?
టూరిజం డైరెక్టర్‌గా స్మితా సబర్వాల్ గత 27వ తేదీ వరకు పని చేశారు. ఆమె ఉన్నప్పుడే మిస్ వరల్డ్ పోటీలపై నిర్వహణపై ప్రచారం మొదలైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ప్రారంభించారు. పోటీలపై పలుమార్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కానీ, స్పాన్సర్లను రాబట్టడంలో ఆమె ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి.
ఎస్బీఐ బ్యాంకు అధికారులు స్పాన్సర్ షిప్ కోసం వచ్చి మూడు నాలుగు గంటలకుపైగా ఆమె ఛాంబర్ ముందు వెయిట్ చేసి వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా వారితో దురుసు వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో మళ్లీవారు తిరిగి స్పాన్సర్ షిప్ కోసం రాలేదని సమాచారం. ఇలా ఇంకా కొంతమంది ముందుకొచ్చినా సమయం ఇవ్వకపోవడంతో వెనక్కి వెళ్లారని తెలిసింది.
దీనికి తోడు ఆమె వ్యక్తిగతంగా హైలెట్ కావడానికే చూశారు కానీ పోటీల నిర్వహణను సక్సెస్ చేసేందుకు కాదని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు, టూరిజం ఈడీగా విజయ్‌కు సైతం స్పాన్సర్లతో మాట్లాడాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ఆయన మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని, ఎక్కువగా ఆదాయంపై కాకుండా ఇతర మార్గాలపై దృష్టి సారించారనే ప్రచారం జరిగింది.
వీరిద్దరి శైలితోనే పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాలేదని ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా శాఖలో జరుగుతున్న రిపోర్ట్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వీరిని విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. విజయ్‌ను మాతృ సంస్థకు ఈనెల 15న బదిలీ చేశారు. ఆయన్ను పోటీలు ప్రారంభం అయినప్పటి నుంచి ప్రభుత్వం పక్కనబెట్టినట్లు సమాచారం. మరోవైపు, టూరిజం శాఖలో అధికారుల మధ్య సమన్వయం లోపం, విభేదాల కారణంగా స్పాన్సర్లు ముందుకు రాకపోవడం మరో కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పబ్లిసిటీలోనూ ఫెయిల్
జయేష్ రంజన్ టూరిజం శాఖ డైరెక్టర్ (ఎఫ్ఏసీ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ స్పాన్సర్ల కోసం చివరి వరకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే, ఇంతకు ముందు అధికారుల వ్యవహారశైలితో ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. అందుకే మిస్ వరల్డ్ పోటీల్లో అసలు ఏ ఒక్క స్పాన్సర్‌కు చెందిన ప్లెక్సీలు గానీ, ప్రచార యార్డులు గానీ కనిపించడం లేదు.
Also read: RGV Heroine: నటనకు గుడ్ బై చెప్పి.. సన్యాసిగా మారిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్?
టూరిజం శాఖ అధికారుల తీరు, ఏర్పాట్లపై మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు సైతం నారాజ్‌గా ఉన్నట్లు సమాచారం. అధికారులు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం, పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాకపోవడం, వారికి సరైన మైలేజ్ రాకపోవడంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 150 దేశాల్లో పోటీల లైవ్ టెలికాస్ట్ చేస్తామని సైతం ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ టూరిజం శాఖ ప్రమోట్ అవుతుందని, 22 టూరిజం ప్రాంతాలు ప్రచారంతో విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చని భావించారు. కానీ అధికారుల తీరుతో ఆశించిన మేర పబ్లిసిటీ రావడం లేదని సమాచారం. అసలు, పబ్లిసిటీ కన్నా అధికారుల తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది. వరంగల్ వెయ్యి స్తంభాల గుడి దగ్గర పోటీదారుల కాళ్లు కడిగించడంపై విమర్శలు వచ్చాయి.
లైవ్ టెలికాస్ట్ సైతం సరిగ్గా లేదని, అధికారుల మధ్య సమన్వయం లేదని స్పష్టంగా కనిపించింది. అయితే, పోటీలు ముగియడానికి మరో 10 రోజులు ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులపై దృష్టి సారించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.